ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

Updated : 29 Apr 2024 06:32 IST

సామాజికవేత్త గుంటుపల్లి శ్రీనివాస్‌

ఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఇటీవల విడుదల చేసిన పదోతరగతి పరీక్షల ఫలితాల్లో వచ్చిన మార్కులు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 2023లో 590 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 839 మందిఉండగా.. ఈ ఏడాది 2,060 మంది ఉన్నారు. గత ఏడాది 550.. అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు 43,782 మంది కాగా.. ఈసారి 63,985మంది ఉన్నారు. 2023లో మొదటి శ్రేణి మార్కులు వచ్చిన వారి కంటే ఈసారి 94,945 మంది అధికంగా ఉన్నారు. ఈ మార్కులు పరీక్షలు నిర్వహించిన తీరు, అధికారుల ఉద్దేశాలను తెలియజేస్తోంది. పిల్లలు కలిసి కట్టుగా ఒకరి దాంట్లో మరొకరు చూసుకొని పరస్పరం సహకరించుకుంటూ పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది. ఇదంతా విద్యాశాఖ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో జరిగింది’ అని విమర్శించారు.

‘కొంతమంది విద్యార్థులు పక్కనున్న వాళ్ల పేపర్‌లో చూసి రాస్తూ వారి పక్క విద్యార్థులు ఏ మాధ్యమంలో సమాధానాలు రాస్తే వారు అదే మాధ్యమంలో సమాధానాలు రాశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రంలో పక్కనున్న వారి పేపర్‌లో చూసి తాము చదవని మాధ్యమంలో సమాధానాలు రాస్తే.. ద్విభాష పాఠ్యపుస్తకాలలోని ఆంగ్లంలో ఉన్న పాఠాలు చదివి.. పరీక్షల్లో సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితం సమాధానాలు ఆంగ్లంలో రాశారని అధికారులు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. వాస్తవంగా పదో తరగతి విద్యార్థులకు ద్విభాష పాఠ్యపుస్తకాలనే ఇవ్వలేదు. అయినా ప్రభుత్వం ద్విభాష పుస్తకాలు ఇచ్చినట్లు.. పిల్లలు వాటిని చదివినట్లు ప్రచారం చేయడం అత్యంత బాధాకరం. ఎన్నికల ముందు పార్టీలు ఓటర్లపై డబ్బులు వెదజుల్లుతాయి. మద్యం పారిస్తాయి. ఇప్పుడు వ్యూహాలు మార్చి.. ఎన్నికల కోసం పరీక్షల్లో చూచిరాతలను ప్రోత్సహించి, ప్రశ్నపత్రం స్థాయి తగ్గించి అత్యంత సులువైన ప్రశ్నలు ఇచ్చి, మార్కుల వరద పారించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఓట్లు వేస్తారని విద్యాశాఖ అధికారులు భావించారా? ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వారిని గెలిపించేందుకు విద్యాశాఖ అధికారులు ఇదంతా చేశారా’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని