‘కాపు’ కాస్తానని కాటేశారు!

దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్‌ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే.

Updated : 30 Apr 2024 06:21 IST

జగన్‌ కాపులకు చేసిన దగా అంతా ఇంతా కాదు
రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని మ్యానిఫెస్టోలో హామీ
ఇచ్చింది రూ.2 వేల కోట్లు మాత్రమే
తెదేపా అమలు చేసిన పలు పథకాలూ ఎత్తివేత
ఈనాడు, అమరావతి

మాటల గారడీలోనే కాదు.. అంకెల గారడీలోనూ..
జగన్‌ను మించిన వారుండరు.
అందుకు ప్రత్యక్ష నిదర్శనం.. కాపులకు ఆయన ఇచ్చిన హామీ..
దాన్ని అమలు చేసిన తీరు!
కాపు కాస్తానని చెప్పి.. కాటు వేసిన ఘనుడు జగన్‌...


కాపు కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం

- గత ఎన్నికల మ్యానిఫెస్టోలో కాపులకు జగన్‌ ఇచ్చిన హామీ ఇదొక్కటే. నిజంగా కాపుల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఈ ఒక్కటైనా సక్రమంగా అమలు చేయాలి కదా? కానీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ ఏర్పాటు లక్ష్యాన్నే మార్చేశారు. గత ప్రభుత్వాలు అందించిన స్వయం ఉపాధి రుణాలను ఎత్తేశారు. అందరికీ ఇచ్చే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాల లెక్కల్ని కాపుల ఖాతాలో వేసి ఇదిగో గొప్పగా సాయం అందించామని అంకెల గారడీ చేస్తున్నారు.


గా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్‌ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. కాపుల విషయంలో అయితే మరీ ఘోరం. ఐదేళ్లలో ఎదిగేందుకు ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. అంతటితోనే ఆగలేదు. కాపు కాసేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పాతరేశారు. చివరికి నిరుపేదలకు ఉపయోగపడే కాపు భవనాలపైనా కక్షకట్టారు. తెదేపా ప్రభుత్వం కట్టిందనే అక్కసుతో నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. నైపుణ్య శిక్షణ అందితే కాపు యువత ఎక్కడ బాగుపడిపోతారోనని దానికీ తిలోదకాలిచ్చారు. ఇదేకాదు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో తెదేపా ప్రభుత్వం కాపులకు అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లనూ రద్దు చేశారు. ఇన్ని దుర్మార్గాలకు ఒడిగట్టిన ఆయనపై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ఓట్లాటకు తెరతీసి ‘కాపు నేస్తం’ ప్రకటించారు. అంటే, ఇది కూడా మనస్ఫూర్తిగా అమలు చేసింది కాదు. అందులోనూ నిబంధనల కొర్రీలు వేశారు. ఐదేళ్లలో ఆ పథకం కింద ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లే. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేవలం కాపుల అభివృద్ధికే ఖర్చు చేస్తానని చెప్పి ఆయన చేసిన దగా ఇది.


గత ప్రభుత్వంలో రూ.1,441 కోట్ల రుణాలు...

ఏ వర్గమైనా పేదరికం నుంచి బయటపడటానికి ఉపాధి కల్పనే కీలకం. ఉపాధి అవకాశాలు కల్పించడం లేదంటే.. వారి ఎదుగుదలకు అడ్డుతగులుతున్నట్టే. జగన్‌ సీఎం అయ్యాక కాపులకు ఇదే చేశారు. తెదేపా ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు కాపుల్లోని నిరుపేదలూ ముందుకు వెళ్లాలని వారికోసం కార్పొరేషన్‌ పెట్టింది. అందరికీ వర్తించే పథకాలను కాపులకు అమలు చేస్తూనే.. 2014-19 మధ్య కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేకంగా రూ.4 వేల కోట్లు ఖర్చు చేసింది. తెదేపా హయాంలో కాపులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీతో రుణాలు మంజూరు చేసింది. అదనంగా బ్యాంకులతో మాట్లాడించి రుణాలు అందించింది. ఇలా 2.11 లక్షల మందికి రూ.1,441.75 కోట్ల మేర రాయితీ రుణాలను అందించారు. వైకాపా హయాంలోనూ ఈ పథకం కొనసాగి ఉంటే మరెందరికో మేలు జరిగేది. కానీ రాయితీ రుణాల్ని ఎత్తేశారు జగన్‌. పైకి మాత్రం కాపులకు గొప్ప మేలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆయన ఇచ్చిందేంటో తెలుసా? అందరికీ వర్తించే పింఛన్లు, ఉపకారవేతనాలు, ఇతర పథకాలు. వాటిలో ఉండే కాపుల సంఖ్యను పక్కకు తీసి.. పెద్ద సంఖ్యగా చూపించారు. జగన్‌కు మాత్రమే చేతనయ్యే అంకెల గారడీ ఇది.


‘విదేశీ విద్య’ అమలుకు మనసొప్పలేదు...

తమ బిడ్డల్ని రూ.లక్షలు పెట్టి గొప్ప చదువులు చదివించలేక ఇబ్బందిపడే తల్లిదండ్రులకు తెదేపా అమలు చేసిన ‘విదేశీ విద్య’ పథకం గొప్ప ఊరటగా నిలిచింది. కాపులకు దీన్ని అమలు చేసేందుకూ జగన్‌కు మనసొప్పలేదు. అధికారం చేపట్టిన తర్వాత మూడేళ్లపాటు ఈ పథకం అమలు ఊసే ఎత్తలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని వారిని మళ్లీ మభ్యపెట్టేందుకు ఎత్తుగడ వేశారు. సాయాన్ని పెంచి అమలు చేసినట్టు పైకి చూపిస్తూ.. అమల్లోకి వచ్చేసరికి కుయుక్తులు పన్నారు. తెదేపా ప్రభుత్వం ఈ పథకం కింద 1,892 మంది విద్యార్థులను విదేశాలకు పంపింది. అందుకు రూ.207 కోట్లు ఖర్చు చేసింది. అదే వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన విధానాన్ని పరిశీలిస్తే... తొలుత 200 క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు సంపాదిస్తేనే ఆర్థిక సాయాన్ని అందిస్తామని మోకాలొడ్డింది. ఆ తర్వాత నిబంధనల్ని మరింత కఠినతరం చేసి సబ్జెక్ట్‌ల అంశాన్ని తెరమీదకు తెచ్చి.. వాటిలో టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న విశ్వవిద్యాయాల్లో సీటు సంపాదిస్తేనే సాయాన్ని అందిస్తామనేలా అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వుల్లో మళ్లీ సవరణలు చేశారు. జగన్‌ ఏలుబడిలో ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులు 250 మంది కూడా లేరు. ఇంతకంటే వంచన ఎక్కడైనా ఉంటుందా?


నైపుణ్య శిక్షణనీ ఆపేశారు..

ప్రతిభ ఉన్నా సరైన నైపుణ్యం లేక వెనుకబడే యువత ఎంతో మంది ఉన్నారు. నైపుణ్య శిక్షణ అందిస్తే అలాంటివారి కెరీర్‌కు తిరుగుండదు. తెదేపా ప్రభుత్వం కాపుల పట్ల ఇదే ఆలోచన చేసింది. వారికి ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంది. ఎక్కడికక్కడ ప్రత్యేక నోటిఫికేషన్లు ఇచ్చి వారిని ప్రోత్సాహించింది. ఇలా 2014-19 మధ్య 40వేల మంది కాపు యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇందుకుగాను రూ.28.73 కోట్లు ఖర్చు చేసింది.

 సూక్ష్మ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాదు.. ‘విద్యోన్నతి’ పథకం కింద సివిల్స్‌ పరీక్ష రాసేవారికి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని తెచ్చింది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌.. ఇలా అభ్యర్థులు కోరుకున్న చోట శిక్షణ ఇప్పించింది. ఆ ఖర్చు మొత్తాన్ని అప్పటి ప్రభుత్వమే భరించింది. ఒక్కొక్క విద్యార్థిపై రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసింది.


తెదేపా హయాంలో కాపులకు రిజర్వేషన్‌

దశాబ్దాలుగా నలిగిన కాపుల రిజర్వేషన్‌ కలకు తెదేపా ప్రభుత్వం దారి చూపింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఇచ్చే 10 శాతంలో 5 శాతం రిజర్వేషన్లను వారికే కల్పించింది. దీన్ని కూడా జగన్‌ అధికారంలోకి రాగానే రద్దు చేశారు. ఆయన మంత్రివర్గంలో ఉండే కాపు వర్గానికి చెందిన సహచరులుగానీ, ఇతర వైకాపా నేతలుగానీ ఇప్పటివరకు దీనిపై జగన్‌ను ప్రశ్నించిన దాఖలాలే లేవు.


కాపు భవన నిర్మాణాలపైనా కన్నుకుట్టిన జగన్‌!

పేద, మధ్య తరగతికి చెందినవారు ఏదైనా శుభకార్యాన్ని చేసుకోవాలంటే చిన్న ఫంక్షన్‌ హాలైనా రోజుకు రూ.20 వేలకుపైనే చెల్లించాల్సిన దుస్థితి. అదే కాపు భవనాల్లో అయితే ఆ సామాజిక వర్గానికి పూర్తి ఉచితం. అందుకే భవనాల ఏర్పాటుకు తెదేపా ప్రభుత్వం  అడుగులు వేసింది. ఇక్కడ శుభకార్యాలే కాకుండా సామాజిక వర్గ సమావేశాలు, సదస్సులు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో రూ.145.15 కోట్లతో 500 మినీ కాపు భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిని చూసి జగన్‌కు కన్నుకుట్టినట్టుంది. అందుకే చాలా చోట్ల వాటి నిర్మాణాలను మధ్యలోనే వదిలేశారు. వాటికి తెదేపా ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని వెనక్కి తీసుకున్నారు. దీనిపై కాపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో వైకాపా నేతల సిఫార్సుల మేరకు ఎన్నికల వేళ కొన్ని చోట్ల పనులు కొనసాగిస్తున్నారు.


తెదేపా ప్రభుత్వం కాపు యువతకు రుణాలివ్వడం వరకే ఆగిపోకుండా.. ఏ ఆదరువు లేని వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఆసక్తి ఉన్న వారికి డ్రైవింగ్‌ శిక్షణ ఇప్పించింది. ఖరీదైన ఎస్‌యూవీల కొనుగోళ్లనూ ప్రోత్సాహించింది. మొత్తంగా 284 మందికి రూ.21.30 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. వీటితో లబ్ధిదారులు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించేవారు. పేదరికం నుంచి కుటుంబాన్ని బయటపడేసేందుకు ఇంతకంటే ఏం కావాలి? కానీ జగన్‌ ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేయలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని