‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప

అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్‌ చేతికొచ్చింది ఆంధ్రావని!

Updated : 03 May 2024 09:49 IST

రుణ భారం రూ.10,75,837 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక విధ్వంసకారుడు జగన్‌
శ్రీలంకతో సహా ఇతర సంక్షోభ దేశాల్లా రుణాంధ్ర
కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరికలనూ పట్టించుకోని వైకాపా సర్కారు  
చెల్లింపుల భారం త్వరలో ఏడాదికి రూ.లక్ష కోట్లు
అంతిమంగా ప్రజలే బాధితులు

అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి...
70 శాతం పూర్తయిన పోలవరం...
ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో...
... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా...
ఐదేళ్ల కిందట జగన్‌ చేతికొచ్చింది ఆంధ్రావని!

* * *
బాధ్యతగల నాయకుడెవరైనా ఏం చేస్తారు?
ఆ పురోగతిని పరుగులెత్తిస్తారు... అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తారు!

* * *
అలాగే చేస్తారని.... రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో పరుగులెత్తిస్తారని... నమ్మి, జగన్‌కు ప్రజలు పగ్గాలు అప్పగిస్తే... ఎలా పాలించాలో తెలియక, అభివృద్ధి చేతకాక... ఒప్పుల కుప్పగా ఎదగాల్సిన బిడ్డను అప్పులదిబ్బగా మార్చారు! అన్నపూర్ణను దివాలా అంచులకు చేర్చారు!
వెనిజువెలా, అర్జెంటీనా, గ్రీసు దేశాల సరసన నిలబెట్టారు!
సమయానికి జీతాలివ్వక జీవితాలను అల్లాడించారు... బిల్లులు చెల్లించలేని రాష్ట్ట్ర్రమనే మచ్చను మిగిల్చారు!!

సిగరెట్‌ తాగడం తప్పని మనకు ఎవరైనా చెబితే ఓహో..! ఆయన సిగరెట్‌ తాగరేమోనని అనుకుంటాం. కానీ, జగన్‌ రివర్స్‌ కదా! ఎన్నికల ముందు ప్రభుత్వానికి ఎన్నో సుద్దులు చెప్పారు. ప్రజలు నమ్మేశారు. అప్పుల విషయంలోనూ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన చెప్పని సలహా, ఇవ్వని సూచనా లేదు. ‘‘చట్ట పరిధిని దాటి అప్పులు    తీసుకునే, నిధులు వాడుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది?   నిబంధనలకు లోబడి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం 3% వరకు మాత్రమే రుణాలు తీసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం 8% వరకు అప్పులు చేస్తోంది. ఇది ప్రభుత్వమా... లేక ప్రయివేటురంగ సంస్థా?’’ అని జగన్‌ నాడు నిలదీశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం అప్పులెన్ని చేసినా పర్వాలేదంటూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఎప్పటికప్పుడు మార్చేశారు. ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కార్పొరేషన్లకు బదలాయించేసి, వాటిని ఆయా కార్పొరేషన్ల ఆదాయాలుగా చూపించి రూ.వేల కోట్ల అప్పులను పుట్టించారు.

కేంద్ర ప్రభుత్వమే భయపడేలా చేష్టలు...

రాష్ట్ర రుణాలు, చెల్లింపుల భారం మొత్తం రూ.10,75,837,00,00,000. ఈ అంకె చూసి ప్రతి ఆంధ్రుడూ భయపడాల్సిందే. ఒక్కసారి అవకాశమిస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు. ఏ కోశానా అభివృద్ధి లేకుండా, అప్పులు తీర్చే మార్గాలను సృష్టించకుండా, కోశాగారాన్ని గుల్లచేశారు. ఈయన చేస్తున్న అప్పులను చూసి కేంద్ర ప్రభుత్వమే భయపడింది. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దిల్లీలో సమావేశం పెట్టి... శ్రీలంకను చూసి జాగ్రత్తపడండని, అప్పులు చేయకండని హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. జగన్‌ అప్పులు సేకరించిన తీరు... కేంద్ర ఆర్థిక శాఖను, రిజర్వు బ్యాంకును, ఆఖరికి ముంబయి స్టాక్‌ ఎక్ఛ్సేంజీని కూడా భయపెట్టింది. ఈ తరహా అప్పులు, ఇలాంటి మార్గాలు ఎక్కడా, ఎన్నడూ లేవని ఆర్థిక నిపుణులు సైతం విస్తుపోయారు.

రుణ విస్ఫోటనమేనన్న కాగ్‌

ఇది రుణ విస్ఫోటనమే... అని సాక్షాత్తూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక ఆందోళన వ్యక్తంజేసింది. ఏపీ అప్పుల తీరును నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అప్పుల లెక్కలను అందుబాటులో ఉంచడం లేదని చెబుతూనే రాష్ట్రంలో రుణ ప్రమాద ఘంటికలపై హెచ్చరించింది. ‘‘రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చిన మొత్తాన్ని మళ్లీ అప్పులు తీర్చేందుకే వెచ్చిస్తోంది. అభివృద్ధి పనులకు, రాబడి పెంచేందుకు ఖర్చు చేయడంలేదు. స్థిరాస్తులు సమకూర్చడం లేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల వలయంలో చిక్కుకుంది. బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తోంది’’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ దా‘రుణ’ పరిస్థితులను కాగ్‌ కళ్లకు కట్టింది.

తప్పుతప్పంటూ వేలెత్తి చూపుతున్నా...!

ఆంధ్రప్రదేశ్‌ రుణాల తీరు తప్పుతప్పంటూ ఎన్నో కీలక సంస్థలు వేలెత్తిచూపుతున్నా... పాలకుడు రాష్ట్రాభివృద్ధిని వదిలేసి రుణాభివృద్ధి వైపే పయనించారు. ఏపీ రాష్ట్ర కార్పొరేషన్లకు అప్పులను ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలనీ ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అప్పులు తీసుకుంటున్న తీరులో తప్పులు ఉండటంతోనే ఇలాంటి హెచ్చరికలు చేయాల్సి వచ్చింది. ఫలితంగా రుణమిచ్చేందుకు తొలుత అంగీకరించిన ఎస్‌బీఐ తర్వాత వెనక్కి తగ్గింది. ఆ రుణం ఇప్పించండంటూ సాక్షాత్తూ సీఎం జగనే కేంద్రాన్ని, ప్రధానిని వేడుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమేనని, ఇది రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి స్పష్టంగా పేర్కొంటూ రాష్ట్రానికి లేఖ రాశారు. బయటి నుంచే కాదు అంతర్గతంగా రాష్ట్రంలో ఎవరి వద్ద నిధులున్నా లాగేసుకోవడమే ప్రభుత్వ పనిగా మారింది. రాష్ట్ర ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి ఆ సొమ్ములన్నీ తమ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు ఆదేశించారు. వడ్డీలను తామే చెల్లిస్తామంటూ అందరి నుంచి నిధులన్నీ తీసేసుకుని వాడేశారు. ఇలా చేయడం సరికాదని ఆర్‌బీఐ సైతం తప్పు పట్టింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అప్పుల తీరూ ప్రశ్నార్థకమైంది.

ఆర్థిక సలహాదారుల నియామకం!

ప్రభుత్వాలు ఎక్కడైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సలహాదారులను నియమించుకుంటాయి. వారితో వివిధ రంగాలపై అధ్యయనం చేయిస్తాయి. సీఎం జగన్‌ శైలి వేరు కదా... అప్పులు పుట్టించేందుకు ఆర్థిక సలహాదారులను, కన్సల్టెంట్లను పెట్టుకున్నారు. వారేమో చట్టానికి మసిపూసి మారేడు కాయ చేయడమెలాగో పరిశోధించి, అప్పులు తేవడంలో సిద్ధహస్తులయ్యారు. వీరి సలహాతోనే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. రూ.25 వేల కోట్ల అప్పు కావాలని బ్యాంకులను అడిగారు. ఒకవేళ కార్పొరేషన్లు చేతులెత్తేస్తే... అప్పు తీర్చేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇప్పించారు. అయినా బ్యాంకులు నమ్మలేదు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా అప్పులను తీర్చడానికే సరిపోతోందని భయపడి... విలువైన ఆస్తులను తాకట్టు పెట్టాలని బ్యాంకుల కన్సార్షియం షరతు పెట్టింది. అంతే విశాఖ నగరంలోని కలెక్టర్‌, ఆర్డీవో, రిజిస్ట్రార్‌   కార్యాలయాల భవనాలను... వందల ఎకరాల ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టేశారు. ఆస్పత్రుల  భవనాలు, మార్కెట్‌ యార్డులనూ వదల్లేదు.


రుణాలతో ఏం చేశారు?

ఉద్యోగి ఇల్లు నిర్మించుకోవడానికి, వ్యాపారి ఆస్తుల పెంపునకు, విద్యార్థి చదువుల కోసం, రైతు పంటల సాగుకు అప్పులు చేస్తారు. మరి సీఎం జగన్‌ ఎందుకు అప్పులు చేస్తున్నారు?     రూ.లక్షల కోట్ల రుణాలు తెచ్చి ఏపీలో ఎన్ని ఆస్తులు సృష్టించారు? అంటే ఏమీ లేవు. చేసిన రుణాలు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన దారుణ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముఖ్యంగా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు రావు. పింఛనుదారులకు పెన్షన్లు అందవు. నెలలో ఏ తేదీన జీతం ఖాతాలో పడుతుందో కూడా తెలియదు. అప్పటివరకు ఇంటి యజమానికి అద్దె చెల్లించడం, కిరాణా దుకాణంలో సరకులు కొనడం, పాఠశాలల ఫీజులు కట్టడం, మందులను కొనుగోలు చేయడం... ఇలా ఎన్నో ఆర్థిక కార్యకలాపాలు వాయిదా పడుతున్నాయి. ఇది సమాజంలో నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు నిర్మాణరంగం కుదేలైంది. ప్రాజెక్టులూ నిర్మించలేదు. రోడ్లు వేయలేదు. కాలువలు తవ్వలేదు.

అభివృద్ధి పనులన్నీ ఆగిపోయాయి. తాపీమేస్త్రీలు, భవన నిర్మాణ కార్మికులు, వృత్తిదారులకు ఉపాధి లభించలేదు. చేయూత, ఆసరా, పెట్టుబడి రాయితీ, రైతుభరోసాలకు జగన్‌ బటన్‌ నొక్కినా... ఖాతాలకు సమయానికి సొమ్ములు చేరలేదు. జగన్‌ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు తీసుకున్నా ఏ పనులకూ బిల్లులు సరిగా చెల్లించలేదు. దాంతో బకాయిల భారం పేరుకుపోయింది. గుత్తేదారులు, సరఫరాదారులు విలవిల్లాడుతున్నారు. ఆఖరికి కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి సైతం వీరు ఫిర్యాదులు చేశారు. పెండింగు బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ పెండింగు బిల్లులూ ఒక రకంగా అప్పుల్లాంటివే. మొత్తానికి జగన్‌ రాష్ట్ర గల్లా పెట్టెను ఊడ్చేశారని జనానికి తెలిసిపోయింది.


వీటి భారం ప్రజలపైనే..

జగన్‌ సర్కారు అప్పుల భారం పెంచితే మనకేంటని అనుకోవడానికి లేదు. ఎందుకంటే... ఆ అప్పులన్నీ నయా పైసాతో సహా తీర్చాల్సింది ప్రజలే కాబట్టి. అప్పులను తీర్చేందుకు ప్రభుత్వం సామాన్యులపై ఎడాపెడా పన్నులు మోపుతోంది. ప్రభుత్వ రాబడికి 70% ప్రజల నుంచి పన్నుల రూపంలోనే వసూలు చేస్తారు.

ఒకవైపు అప్పులు పెంచుతున్న జగన్‌ సర్కారు మరోవైపు ప్రజల జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేస్తోంది. ప్రభుత్వ ఆదాయమంతా అప్పులు, వడ్డీలకే చెల్లిస్తే ఇక రాష్ట్ర పురోగతి ఎక్కడ? కాగ్‌ తెలిపిన ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో రూ.3,47,944.64 కోట్ల అప్పు తీర్చాలి. అంటే అసలు, వడ్డీని తీర్చేందుకు ఏడాదికి సుమారు రూ.40 వేల కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సమర్పించిన రిపోర్టుల ఆధారంగానే కాగ్‌ ఈ లెక్కలను తేల్చింది. వివిధ కార్పొరేషన్ల అప్పులు, ఇతర పెండింగు చెల్లింపుల భారాలు కలిపితే రాబోయే ఐదేళ్లలో ఏడాదికి రూ.93 వేల కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు ఈ చెల్లింపుల భారం పెరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం రూ.లక్ష కోట్లు దాటిపోయింది. ఈ కారణంగానే ఏపీలో పన్నులు, వివిధ విభాగాల్లో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంటోంది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోలు ధరల భారం ఎక్కువ. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను, మద్యంపై పన్నులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలను జగన్‌ సర్కారు పెంచుకుంటూ పోయింది. కొత్త వాహనాలపై జీవితకాల పన్ను విధించింది. హరిత పన్ను రూపంలోనూ వసూళ్లు సాగించింది. ఆఖరికి చెత్తపై కూడా పన్ను వేసింది!


రాష్ట్ర బ్రాండ్‌ను పూర్తిగా దిగజార్చారు

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి... మద్యం అమ్మకాలపై సెస్‌ విధించి, వసూలు చేసుకునే అధికారం దానికి కల్పించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైనా కొనసాగించారు. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ద్వారా అప్పులు పుట్టించారు. రాష్ట్ర బ్రాండ్‌ను దిగజార్చేశారు. అంతేకాదు... రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలో నిధులున్నా లాగేసుకున్నారు. ఆఖరికి కలెక్టర్ల వద్ద ఉండే రిజర్వు నిధులనూ వాడుకున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చే పరిమితిని రెట్టింపు చేసేశారు. మునుపటి ఆర్థిక సంవత్సరంలోని మొత్తం రెవెన్యూ రాబడిలో 90% వరకు ప్రభుత్వ గ్యారంటీలు ఉండాలనే నిబంధన ఉంది. జగన్‌ సర్కారు దీన్ని 180 శాతానికి పెంచడం గమనార్హం.



ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని