ఈ పాపం జగన్‌దే

జగన్‌ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు.

Updated : 03 May 2024 09:08 IST

అవ్వాతాతల ప్రాణాలు పణంగా పెట్టి రాజకీయాలా?
జవహర్‌రెడ్డీ.. పింఛను దారుణాలు కనిపించడంలేదా?
పింఛనుదారులను ఇక్కట్ల పాల్జేసిన ప్రభుత్వం
బ్యాంకుల దగ్గర బారులుతీరిన లబ్ధిదారులు
గంటల తరబడి నిరీక్షణ
అక్కడ కనీస సౌకర్యాలూ కరవే
సొమ్మసిల్లిన పలువురు మహిళలు
వేలమంది ఖాతాల్లో జమకాని సొమ్ము
ఈనాడు - అమరావతి


‘పింఛను’ తెచ్చిన ప్రాణాపాయం

చేతిలో ఆధార్‌ కార్డుతో నేలపై పడి ఉన్న ఈమె ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన చిచ్చడి చినరామమ్మ. పింఛను నగదు కోసం మండుటెండలో నాలుగు కిలోమీటర్ల దూరంలోని వేలేరుపాడు యూనియన్‌ బ్యాంకుకు గురువారం వచ్చారు. అక్కడ సమాధానం చెప్పే వారు లేకపోవడంతో సుమారు గంట పాటు వేచి చూసి, నీరసించి స్పృహ తప్పి పడిపోయారు. గమనించిన సచివాలయ సిబ్బంది వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించడంతో ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు.

న్యూస్‌టుడే, వేలేరుపాడు


జగన్‌ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. మండుటెండల్లో మలమలమాడిపోయేలా వ్యూహం పన్నారు. ఈ పాపమంతా జగన్‌దే. 46 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రత ఠారెత్తిస్తుంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచలేదు. దీంతో గొంతు తడారిపోతూ వేదన చెందారు. బ్యాంకుల్లో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు లేక...గంటల తరబడి నిల్చోలేక నరకయాతన అనుభవించారు. కొన్ని చోట్ల బ్యాంకులు నిండిపోవడంతో తలుపులు మూసి వృద్ధుల్ని బయటే ఎండలో ఉంచారు. ఇలా ఒకటి, రెండు కాదు.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని నానాకష్టాలు పెట్టి వికృత ఆనందం పొందారు.

1.35 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి తేలికైన మార్గం ఉన్నా కాలదన్నారు. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించినా రెండు రోజుల్లోనే 90 శాతంపైగా పంపిణీ పూర్తవడంతో ఈ సారి సచివాలయాలకు, బ్యాంకులకు పదే పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు. మరోవైపు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలగకపోతాయా? దాన్ని తెదేపా, మిత్రపక్షాలపై వేయకపోతామా? అని గోతికాడ నక్కల్లా ఎదురుచూసేలా గురువారం ఉదయం నుంచే వైకాపా సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు. కుటిల రాజకీయ క్రీడను నడిపించారు. పేటీఎం బ్యాచ్‌ను పెట్టి సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు. దీన్ని కొన్ని చోట్ల పింఛనుదారులే తిప్పికొట్టారు. ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా... పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ తప్పిదం కాదా? అని ఎదురుతిరిగారు. గత నెల మాదిరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించకుండా బ్యాంకుల వద్దకు రప్పించడమేంటని మండిపడ్డారు.

ముప్పుతిప్పలు పెట్టారు..

రాష్ట్రవ్యాప్తంగా పింఛనుదారుల్ని జగన్‌ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటింటికీ పంపిణీ చేస్తామని ప్రకటించి చాలా చోట్ల వారినీ బ్యాంకుల వద్దకు రప్పించి కష్టాలకు గురిచేశారు.

  • చాలా మందికి ఖాతాలున్నా నగదు జమ కాలేదు. ఎందుకు జమ కాలేదో స్పష్టత ఇచ్చే వారు కనిపించలేదు. 2, 3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో చెప్పేవారే లేరు. గంటల తరబడి బ్యాంకుల్లో నిల్చుని తీరా నగదు జమ కాలేదని తెలిసి పింఛనుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారు మళ్లీ సచివాలయాలకు వెళ్లారు. అక్కడా సరైన సమాచారం ఇవ్వలేదు. రెండు రోజుల తర్వాత చెబుతామంటూ తిప్పిపంపించారు.
  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆగిరిపల్లి, జీలుగుమిల్లి యూనియన్‌ బ్యాంకుల దగ్గర దివ్యాంగులు నరకయాతన అనుభవించారు.
  • చింతలపూడి బ్యాంకులో జనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో వృద్ధులు, దివ్యాంగులు గంటలకొద్దీ పడిగాపులు కాశారు.
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నవరం నుంచి పింఛను నగదు కోసం దివ్యాంగుడు సుమారు 15 కి.మీ దూరంలోని జలదంకి మండల కేంద్రానికి వచ్చారు. అయితే నగదు జమ కాలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు.
  • ఏలూరు జిల్లా గుండుగొలనుగుంట, దొరసానిపాడు గ్రామాల నుంచి 2 కి.మీ. నడిచి ద్వారక తిరుమలలోని బ్యాంకు వరకు నడుచుకుంటూ వచ్చారు. వారిలో చాలా మందికి నగదు జమకాలేదు.
  • అనకాపల్లి గవరపాలేనికి చెందిన మహాలక్ష్మి అనే వృద్ధురాలు బ్యాంకు ఖాతా మురిగిపోయింది. మనుగడలోకి రావాలంటే రూ.100, రెండు ఫొటోలు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పట్టుకుని వస్తే రెండు రోజులు తర్వాత ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో ఆమె నిరాశగా వెనుతిరిగిపోయారు.

సాక్షి సంతకం కావాలంటూ బ్యాంకు సిబ్బంది ఆంక్షలు...

వృద్ధులు డబ్బులు తీసుకునే దరఖాస్తు పూర్తి చేయడం రాక నానా అవస్థలు పడ్డారు. కొన్ని బ్యాంకుల్లో నగదు ఇవ్వాలంటే సాక్షి సంతకం కావాలని బ్యాంకు సిబ్బంది ఆంక్షలు పెట్టారు. ఆధార్‌, ఫోన్‌ నంబరు.. బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాలేదని చాలా మందిని వెనక్కి పంపారు. ఆధార్‌ అనుసంధానం చేసిన తర్వాతే నగదు ఇస్తామని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు.

  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ద్వారకాతిరుమలలోని కొన్ని బ్యాంకుల్లో నగదు ఇవ్వాలంటే సాక్షి సంతకం కావాలని బ్యాంకు సిబ్బంది ఆంక్షలు విధించారు.
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్బీఐ, యూనియన్‌ బ్యాంకుల వద్ద వృద్ధులు బారులు తీరారు. విత్‌ డ్రా ఫారాలు నింపడం రాక అవస్థలు పడ్డారు. చాలా మంది వృద్ధులకు నగదు జమకాలేదు
  • ఎచ్చెర్లలో ఉన్న యూనియన్‌, ఎస్బీఐ బ్యాంకుల్లో కొందరు పింఛన్‌ దారుల ఆధార్‌, ఫోన్‌ నంబరు బ్యాంకు ఖాతాకు లింక్‌ కాలేదని, మర్నాడు రావాలని వెనక్కి పంపారు.
  • ప్రకాశం జిల్లా టంగుటూరు, తాళ్లూరు బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా పత్రాలు రాసిచ్చేవారు లేక, తోడు వచ్చినవారికి తెలియక వృద్ధులు గంటల తరబడి వేచి ఉన్నారు.
  • కర్నూలులో విత్‌డ్రా ఫాం పూర్తి చేయడానికి రూ.10 తీసుకున్నారు.

గిరిజనుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..

ప్రజారవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాలు లేక వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పింఛన్‌దారులు కొండలు, గుట్టలు దాటుకుంటూ కాలినడకన మండల కేంద్రాలకు వచ్చారు. ఖాతా మనుగడలో లేక కొందరు..ఆధార్‌ అనుసంధానం కాక మరికొందరు పింఛను నగదు అందక వెనుదిరిగారు.

  • పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సాకిగూడ, సాకి, బారామణి, గోరటి, శిఖలపాయి తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో బ్యాంకుల వద్దకు వచ్చినందుకు రూ.200 ఖర్చయింది. కొంతమందికి ఖాతాల్లో నగదు జమ కాలేదు.
  • కొమరాడ మండలంలో చాలా మందికి బ్యాంకు ఖాతాలున్నా నగదు జమ కాలేదు. వారంతా బ్యాంకులకు వచ్చి వెనుదిరిగారు.
  • సాలూరులో ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన లబ్ధిదారుల పింఛను నగదును ఖాతాల్లో జమ చేశారని తెలిసి బ్యాంకుల వద్ద పడిగాపులు కాశారు.

బ్యాంకుల వద్ద తోపులాట...

ఆలస్యంగా వెళితే నగదు అందదనే ఆందోళనతో ఉదయం 7 గంటల నుంచే బ్యాంకు దగ్గర పింఛన్‌దారులు పడికాపులు కాస్తూ కనిపించారు. తీరా బ్యాంకులు తీసే సమయానికి జనం పెరిగిపోవటంతో తోపులాటలు జరిగాయి.

  • ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్దకు పింఛనుదారులు చేరుకున్నారు. బ్యాంకు తెరవగానే నెట్టుకుంటూ వెళ్లడంతో కొందరు వృద్ధులు, దివ్యాంగులు కిందపడిపోయారు.
  • విశాఖ జిల్లా భీమిలిలో బ్యాంకులు తెరవగానే లోపలకు వెళ్లాలనే హడావుడిలో తోపులాట జరిగింది. వృద్ధులు మధ్యలో ఇరుక్కుపోయి ఇబ్బందులుపడ్డారు
  • నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటలోని ఓ బ్యాంకు దగ్గర పింఛను కోసం వచ్చిన వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయారు.
  • ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో ఓ వృద్దుడు సొమ్మసిల్లి పడిపోయారు.

అదే విషప్రచారం.....

  • ప్రకాశం జిల్లాలో వైకాపా నాయకులు, కొందరు సచివాలయ సిబ్బంది పింఛన్‌దారులను తప్పుదోవపట్టించారు. బ్యాంకులో నగదు పడనివారినీ, నడవలేని వృద్ధులనూ బ్యాంకులకు పంపించారు.
  • యర్రగొండపాలెంలో నడవలేని వృద్ధురాలిని, త్రిపురాంతకంలో దివ్యాంగురాలిని పింఛన్‌ కోసం స్థానిక వైకాపా నాయకులు బ్యాంకులకు పంపించారు.
  • అనంతపురం జిల్లా ఉరవకొండలో సచివాలయాల వద్దకు వెళ్లి ఇంటింటికీ పంపిణీ నిలిచిపోవడానికి తెదేపానే కారణమంటూ పింఛనుదారులకు రాజీనామా చేసిన వాలంటీర్లు చెప్పారు.
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పింఛను నగదు అందించేందుకు డ్వాక్రా ఆర్పీలను వినియోగించారు. ప్రతిపక్షాల కుట్ర వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ పింఛనుదారులకు ఆర్పీలు చెప్పారు. ఎన్నికల్లో వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేశారు.

చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మసరస్సులో.. గురువారం పింఛను కోసం మండుటెండలో బ్యాంకుకు వెళుతూ వడదెబ్బకు గురై మృతి చెందిన వృద్ధుడు గోపాలయ్య. బుధవారమూ ఇలానే ఇద్దరు మృత్యువాత పడ్డారు.


ఇతని పేరు కొర్ర చిన్నయ్య, అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం గాంధీనగర్‌ గ్రామం. బ్యాంక్‌లో పాస్‌పుస్తకం చూపిస్తే మీ ఖాతా మనుగడలో లేదని సిబ్బంది చెప్పారు. అసలు డబ్బులు పడ్డాయా? లేదా? అనే విషయం కూడా తెలపకపోవడంతో ఆయోమయంగానే తిరుగుముఖం పట్టారు.


బ్యాంకుల్లో మెయింటెనెన్స్‌ ఛార్జీల వసూలు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బ్యాంకుల ఎదుట గురువారం ఉదయం నుంచే పింఛను కోసం బారులు తీరారు. ఎక్కడా కనీస సౌకర్యాలు కల్పించలేదు. చాలా మంది 5 నుంచి 40 కిలోమీటర్ల వరకు వ్యవప్రయాసలు కోర్చి వచ్చారు. ఒక్కొక్కరికి రూ.50 నుంచి రూ.400 వరకు ఖర్చయింది. కొన్ని చోట్ల మెయింటెనెన్స్‌ ఛార్జీలు వసూలు చేశారు. గ్రామాల్లో ఉండే వినియోగదారుల సేవా కేంద్రాల్లో రూ.1000కి రూ.10 చొప్పున తీసుకుని నగదు అందించారు. కొందరి ఖాతాల్లో నగదు జమైనా వేలిముద్రలు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పడంతో వెనుదిరిగారు.  కొన్ని చోట్ల బ్యాంకులు, బ్యాంకింగ్‌ సేవా కేంద్రాల్లో పింఛను తీసుకోడానికి 4 నుంచి 5 గంటలు పట్టింది...

  • శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శివారు ప్రాంతమైన బుడగట్లపాలెం నుంచి బ్యాంకు వద్దకు రావడానికి రూ.200 ఆటో ఛార్జీ అయిందని, ఎండకు ఇబ్బంది పడ్డామని పలువురు వృద్ధులు వాపోయారు.  
  • విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో బ్యాంకు లోపల ఖాళీ లేక మండుటెండలోనే పింఛనుదారులు ఎదురుచూశారు. చలామణిలోలేని ఖాతాలకు మెయింటెనెన్స్‌ ఛార్జీల పేరిట రూ.150 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు.
  • విశాఖ జిల్లా అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన ఓ పింఛనుదారుని ఖాతా రెండేళ్లుగా చలామణిలో లేకపోవడంతో ఛార్జీల కింద రూ.2,200 మినహాయించుకుని అక్కడి బ్యాంకు సిబ్బంది రూ.800 మాత్రమే చేతికిచ్చారు.

మీ విషప్రచారాన్ని తెలుసుకోలేనంత అమాయకులనుకుంటున్నారా...

ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా పింఛనుదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది చాలక....ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తారా?  పింఛనుదారుల ఇళ్ల వద్దనే నగదు పంపిణీ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీ మీద లేదా? సచివాలయ సిబ్బంది ద్వారా సులువుగా పంపిణీ చేయచ్చన్న విషయం 5 ఏళ్లు సీఎంగా ఉన్న మీకు తెలియదా? అయినా బ్యాంకుల వద్దకు రప్పించి ఇక్కట్ల పాలు చేయడం కుట్ర కాక మరేంటి? ఆ నెపాన్ని తెదేపాపై నెడుతూ సామాజిక మాధ్యమాల్లో వైకాపా సైన్యంతో పోస్టులు పెట్టిస్తారా? ఫోన్ల ద్వారా ఆడియో మెసేజ్‌లను పంపుతారా? రాజీనామా చేసిన వాలంటీర్లను బ్యాంకులు, సచివాలయాల వద్దకు పంపి విష ప్రచారం చేయిస్తారా? ఇవన్నీ తెలుసుకోలేనంత అమాయకులనుకుంటున్నారా పింఛనుదారులు. మీరు వేసే జిత్తులమారి ఎత్తులన్నీ వారికి తెలుసు. సమయం వచ్చినప్పుడు కీలెరిగి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.


పింఛనుదారుల నుంచి జగన్‌కు దిమ్మతిరిగేలా వచ్చిన సమాధానం...

  • గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైకాపా కార్యకర్తలు...ఇంటింటికీ పింఛను పంపిణీ ఆగిపోవడానికి తెదేపానే కారణమని పింఛనుదారులతో చెప్పించేందుకు ప్రయత్నించినా వారు అంగీకరించలేదు. ఇదే మండలం పెనుమూలి గ్రామానికి చెందిన మహిళలు ఇదంతా చేసింది జగనే అని తెలుసుకోలేని పిచ్చొళ్లమేమీ కాదని సమాధానమిచ్చారు.
  • కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎస్‌బీఐ బ్యాంకు వద్ద నగదు తీసుకోవడానికి వచ్చిన వృద్ధులు జగన్‌పై మండిపడ్డారు. ఇన్ని తిప్పలు పడటానికి ఆయనే కారణమని చెప్పారు. గత నెల సచివాలయాల వద్ద ఇచ్చి...ఇప్పుడు బ్యాంకులకు రమ్మని చెప్పడం ఇబ్బందులకు గురిచేయడం కాదా? అని దుయ్యబట్టారు.


పింఛను కోసం మంచంపై మోసుకెళ్లారు

గంట్యాడ గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాలో వేయడంతో పలువురు వృద్ధులు, రోగులు అవస్థలు పడుతున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బుడతనాపల్లికి చెందిన 80 ఏళ్ల బర్ల అప్పన్న ఎనిమిది నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్నారు. మంచానికే పరిమితమైన ఆయన పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశారు. చేసేది లేక కుటుంబ సభ్యులు సమీపంలోని బ్యాంకుకు మంచంపై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్పన్నను ఇంటికి తీసుకొచ్చారు. గతంలో పింఛను సొమ్మును ఇంటి వద్ద ఇవ్వడంతో సమస్య రాలేదని, బ్యాంకు ఖాతాలో వేయడంతో ఇబ్బంది ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు.


ఖాతాలో వేశారు.. తీసుకునేదెలా!

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రానికి చెందిన ఉచ్చిలి గంగకు రెండు కిడ్నీలు పాడైపోయి మంచాన పడ్డారు. రెండు అడుగులు వేయాలన్నా కుటుంబసభ్యుల సాయం ఉండాలి. ఈమె పింఛను బ్యాంకు ఖాతాలో పడింది. ఆ డబ్బులు తీసుకోకపోతే మందులుండవు. బ్యాంకుకు వెళ్లాలంటే ఆటో అవసరం. ఇద్దరి సాయం ఉండాలి. ఇలాంటి స్థితిలో డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియట్లేదని ఆమె వాపోతున్నారు.

న్యూస్‌టుడే, సీతానగరం


పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని సాకిగూడకు చెందిన వృద్ధురాలు ఎ.తావతి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన కొండ దిగి సాకి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని బ్యాంకుకు వచ్చారు. ఖాతాలో డబ్బులు పడకపోవడంతో మండుటెండలో ఉసూరుమంటూ వెనుదిరిగారు.


వృద్ధులను ఎండలో తిప్పడం పాలకుల లోపమే..

‘‘నేను రెండున్నర కిలోమీటర్ల దూరంలోని కొత్తపాలెం గ్రామం నుంచి మండల కేంద్రం చినగంజాం బ్యాంకు వద్దకు కుమారుడి సాయంతో ద్విచక్ర వాహనంపై ఉదయం 10 గంటలకల్లా వచ్చా. నాకు బ్యాంకులో ఖాతా ఉంది. ఖాతాకు కేవైసీ లేదని తెలియడంతో మూడు గంటల పాటు వేచి ఉన్నా. కుమారుడు కేవైసీకి సంబంధించిన వివరాలు సిద్ధం చేశాడు. ఇంటి వద్ద పింఛను డబ్బు ఇస్తే బాగుండేది. నాలాంటి వృద్ధులను మండుటెండెలో తిప్పడం పాలకుల లోపమే. ఈరోజు పనికాలేదు. మళ్లీ రేపు రావాలని మా అబ్బాయి చెప్పాడు. ఎండలో రావాలంటే ఎంత ఇబ్బందిపడాలి!’’ అంటూ బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద కూర్చొని బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తపాలెం వాసి మంచాల యల్లమ్మ రోదిస్తున్నారు. వృద్ధుల ఇబ్బందులకు యల్లమ్మ ఆవేదన అద్దం పట్టింది.

న్యూస్‌టుడే, చినగంజాం


ముందే హెచ్చరించినా సీఎస్‌ మౌనానికి అర్థం ఏమిటి?

మండుటెండల్లో వృద్ధులు ఇక్కట్లపాలు కాకుండా ఇంటివద్దే పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవటం అత్యవసరమంటూ ‘ఈనాడు’ ముందే హెచ్చరించింది. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పూర్తి నిర్లక్ష్యం కారణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పింఛను అందుకోవడమన్నది లబ్ధిదారులకు పెద్ద శిక్షలా పరిణమించింది. వృద్ధులను ఇబ్బందులకు గురిచేయకూడదనే ఆలోచన ఏమాత్రం ఉన్నా ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చేవారు కాదు.


పింఛన్ల పంపిణీలో వైకాపా రెబల్‌ అభ్యర్థి

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలోని ఓ బ్యాంకు వద్ద స్థానిక వైకాపా నాయకులు పింఛన్ల నగదు ఇళ్ల వద్ద పంపిణీ చేయకపోవడానికి తెదేపా అధినేత చంద్రబాబు కారణమని దుష్ప్రచారం చేశారు. కుప్పంలో వైకాపా రెబల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి బ్యాంకు కరస్పాండెంట్‌గా ఉన్నారు. వసనాడు గ్రామంలో వైకాపా కండువా వేసుకుని పింఛన్లు పంపిణీ చేశారు. తనకే ఓటు వేయాలని అక్కడకు వచ్చిన వృద్ధులను కోరారు.

న్యూస్‌టుడే, కుప్పం టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు