14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు.

Published : 03 May 2024 05:22 IST

మాచర్ల, పుంగనూరు, చంద్రగిరి, తిరుపతి తదితర చోట్ల...
పలుచోట్ల స్వతంత్రులకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తు మార్చాం
సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా

ఈనాడు, అమరావతి: అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా చెప్పారు. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లె, విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గాల్లో వెబ్‌కాస్టింగ్‌తో పాటు కేంద్ర భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామన్నారు. శాసనసభకు పోటీచేస్తున్న 374 మంది అభ్యర్థులు, లోక్‌సభకు పోటీచేస్తున్న 64 మంది అభ్యర్థులకు వారికున్న ముప్పు ఆధారంగా శుక్రవారం నుంచి భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. మొత్తం 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా... వాటిలో 12,438 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, 29,897 పోలింగ్‌ కేంద్రాల్లో (64%) వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ లోగోతో జారీచేసిన ప్రకటన నిలిపేయాలని వైకాపాను ఆదేశించామన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 7 లోక్‌సభ, 8 శాసనసభ నియోజకవర్గాల స్వతంత్రులకు కేటాయించిన ‘గాజు గ్లాసు’ గుర్తును మార్చి వేరేది కేటాయించామన్నారు.

రాష్ట్ర సరిహద్దుల్లో ర్యాండమ్‌గానే తనిఖీలు

  • ‘‘రాష్ట్ర సరిహద్దుల్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయరు. ర్యాండమ్‌గా తనిఖీలు చేస్తారు. ఈ క్రమంలో గోవా తదితర రాష్ట్రాల నుంచి ఏపీలోకి మద్యం వచ్చి ఉండొచ్చు. చెక్‌పోస్టులు ఏర్పాటుచేయక ముందే తీసుకొచ్చి ఇక్కడ డంప్‌లు పెట్టుకుని ఉండొచ్చు’’ అని ఒక ప్రశ్నకు మీనా సమాధానమిచ్చారు.
  • పోస్టల్‌ బ్యాలట్‌ సమర్పించే గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు కొందరికి పోలింగ్‌ విధులు కేటాయించారని, వారికి పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునే అవకాశం లేకుండా పోయిందని ప్రశ్నించగా.. అలాంటి వారందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.
  • రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌ ఓటింగ్‌కు 7.28 లక్షల మంది అర్హులు ఉండగా.. 28,500 మంది మాత్రమే అందుకు సమ్మతి ఇచ్చారన్నారు.
  • మార్చి 16 నుంచి ఇప్పటివరకూ రూ.203.80 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, విలువైన వస్తువులు, ప్రలోభపరిచే వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. అందులో రూ.47 కోట్ల నగదు. రూ.28.83 కోట్ల విలువైన మద్యం, రూ.3.65 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు ఉన్నాయి.

ఉద్యోగ సంఘాలు ప్రభావితం చేయకూడదు

‘‘ఉద్యోగ సంఘాలు... వారి సమావేశాల్లో ఏదైనా పార్టీకి, అభ్యర్థికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ప్రకటనలివ్వకూడదు. తద్వారా ఉద్యోగులు, ఇతరుల అభిప్రాయాల్ని ప్రభావితం చేయకూడదు. అలాంటి చర్యలకు పాల్పడితే అది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే. బాధ్యులపై ఐపీసీతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి’’ అని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వ్యక్తిగత ప్రతిష్ఠ, నైతికత దెబ్బతీసేలా ఉద్యోగ సంఘాల వారు దురుద్దేశపూరిత, నిందాపూర్వక ప్రకటనలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఉద్యోగ సంఘాల కార్యక్రమాల్ని వీడియోగ్రఫీ చేయించి.. సునిశితంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.‘‘సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ నియమావళే అఖిలభారత సర్వీసు అధికారులకూ వర్తిస్తుంది. వీటి ప్రకారం రాజకీయ ఉద్యమంలో భాగస్వాములు కాకూడదు’’ అని తెలిపారు. వివిధ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వివరించారు.

పులివెందుల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయరా?

అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల ఒకటి. సీఈఓ ప్రకటించిన 14 నియోజకవర్గాల జాబితాలో పులివెందుల పేరు లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అక్కడ అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేయాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి.


పింఛన్ల వ్యవహారం ‘పరిష్కారమైపోయిన అంశం’!
దీని భావమేమి?

విలేకర్ల సమావేశంలో పింఛన్ల వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు.. ‘ఎన్నికల సంఘం దృష్టిలో ఇది పరిష్కారమైపోయిన అంశమని’ సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా అన్నారు. దీనిపై తాను ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆయన తెలిపారు. అయితే.. లక్షలమంది పింఛనుదారులు మండుటెండల్లో మలమల మాడిపోతుంటే... అది ఎన్నికల సంఘానికి కనిపించట్లేదనుకోవాలా? వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అభాగ్యులు అత్యంత దయనీయ పరిస్థితుల మధ్య బ్యాంకుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తుంటే అది పట్టదా? పింఛను కోసం వెళ్లి గత రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం చూసి కూడా.. పింఛన్ల వ్యవహారం పరిష్కారమైపోయిన అంశమని ఎలా చెబుతారు? లబ్ధిదారుల్ని కష్టాలు పెట్టటమే పరిష్కారమైపోవడమా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని