వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్‌ నిర్వీర్యం

వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 03 May 2024 05:22 IST

ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు బసవరావు

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో దళితులపై అకృత్యాలు పెరిగాయని ఆరోపించారు. దాడులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ఏ మేరకు అమలవుతోంది? దాడులను ఎంత వరకు అరికట్టాం అన్న అంశాలపై కమిషన్‌ చైర్మన్‌ అయిన ముఖ్యమంత్రి జగన్‌ నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. కర్నూలులో ఇద్దరు దళితులను హత్య చేసి దారుణంగా పెట్రోల్‌ పోసి తగలబెట్టారని చెప్పారు. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకెళ్లాలని అనుకున్నానని.. అయితే ముఖ్యమంత్రి తనతో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి, సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి వద్దకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు. ఆయన వద్దకు వెళితే.. పట్టించుకోకుండా రాష్ట్రంలో హత్యలు జరగడం సహజమంటూ అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. రోజూ ఎన్నో హత్యలు జరుగుతుంటాయని.. బాధితులందరినీ ముఖ్యమంత్రి కలుస్తారా అని ప్రశ్నించినట్లు చెప్పారు. ఒక ఎస్సీ కమిషన్‌ సభ్యుడిగా దళితుల సమస్యలను ముఖ్యమంత్రికి చెబుదామన్నా.. వినే ప్రయత్నం చేయలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత... రెండేళ్ల వరకు ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఛైర్మన్‌ హోదాలో ముఖ్యమంత్రి ఎప్పుడూ సమీక్షలు జరపలేదని ఆరోపించారు. తరచూ నా ఎస్సీ, నా ఎస్టీ, అనే జగన్‌.. మాటల్లో తప్ప చేతల్లో ఉండదన్నారు. ముఖ్యమంత్రి వైఖరిపై విసుగుచెంది కమిషన్‌ సభ్యుడిగా రాజీనామా సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే కొత్త ప్రభత్వం అయినా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే ఎస్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని బసవరావు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని