Domestic Airports: దేశీయ విమానాశ్రయాలకు రూ.11,000 కోట్ల లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ విమానాశ్రయాలు 1.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11000 కోట్ల) పన్ను ముందు లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సీఏపీఏ (కాపా) ఇండియా అంచనా వేసింది.

Updated : 08 Jun 2024 02:14 IST

2024-25పై కాపా ఇండియా అంచనా

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) దేశీయ విమానాశ్రయాలు 1.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.11000 కోట్ల) పన్ను ముందు లాభాన్ని నమోదు చేసే అవకాశం ఉందని సీఏపీఏ (కాపా) ఇండియా అంచనా వేసింది. ఆయా సంస్థలు ఒక్కో ప్రయాణికుడిపై రూ.256.10 (3.1 డాలర్లు) మేర లాభం పొందచ్చని ఇక్కడ జరిగిన విమానయాన సదస్సులో కాపా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ 40.49 కోట్లకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వీరిలో 81.1% మంది దేశీయ ప్రయాణికులు కాగా.. 18.9% మంది అంతర్జాతీయ ప్రయాణికులని వెల్లడించింది. 2024-25లో దేశీయ విమానాశ్రయ సంస్థల మొత్తం ఆదాయం రూ.35,980 కోట్లుగా నమోదయ్యే అవకాశం ఉందని, 2024-24తో పోలిస్తే ఇది 14.8%  ఎక్కువ అని పేర్కొంది. మెట్రో, నాన్‌ మెట్రో నగరాల్లో విమానయాన మౌలిక వసతులకు డిమాండు పెరుగుతోందని, ఇందుకోసం ప్రస్తుతం 11 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడుల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని కాపా ఇండియా తెలిపింది.

2023-24, 2024-25్చలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) లాభదాయకత కూడా మెరుగ్గానే నమోదు కావొచ్చని తెలిపింది. ప్రయాణికుల రద్దీ పెరగడం, ఇటీవల ప్రైవేటీకరించిన 6 విమానాశ్రయాల ద్వారా లభించే ఆదాయ వాటా వల్ల ఏఏఐ ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 


బెంగళూరు- లండన్‌ గాట్విక్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్‌ సర్వీసు 

బెంగళూరు: బెంగళూరు- లండన్‌ గాట్విక్‌ మధ్య ఆగస్టు 18 నుంచి నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులను ఎయిరిండియా ప్రారంభించనుందని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (బీఐఏఎల్‌) తెలిపింది. ఈ మార్గంలో వారంలో 5 విమాన సర్వీసులు ఉంటాయని, తద్వారా వ్యాపార, పర్యాటక ప్రయాణికులకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని పేర్కొంది. లండన్‌లోని రెండు పెద్ద విమానాశ్రయాలు- హీత్రో, గాట్విక్‌కు నేరుగా విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తున్న ఏకైక భారతీయ నగరంగా బెంగళూరు నిలుస్తుందని తెలిపింది. భారత్, బ్రిటన్‌ మధ్య ఆర్థిక, సాంస్కృతిక బంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ పరిణామం ఉపయోగపడుతుందని పేర్కొంది. బెంగళూరు- లండన్‌ గాట్విక్‌ మార్గంలో విమాన సర్వీసు కోసం బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌ విమానాలను ఎయిరిండియా వాడనుంది. ఈ విమానంలో బిజినెస్‌ క్లాస్‌లో 18 ఫ్లాట్‌ బెడ్స్, ఎకనామీ క్లాస్‌లో 238 విశాల సీట్లు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని