విద్యుత్‌ కారు ఓకే.. ఛార్జింగ్ సమయమే ప్చ్‌!.. ఈవీ యూజర్ల మనోగతమిదీ..

EV charging: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగదారులు బ్యాటరీ ఛార్జింగ్‌ సమయం పట్ల ఎక్కువ ఆందోళన చెందుతున్నారని ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో తెలిపింది.

Updated : 05 Jun 2024 19:38 IST

EV charging | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో ఎలక్ట్రానిక్‌ వాహన విక్రయాలు ఊపందుకుంటున్నాయి. పర్యావరణ హితంగా ఉండటంతో వీటి కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అయితే.. వీరిలో ఎక్కువ మంది ఛార్జింగ్ టైమ్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. దీంతో పాటు వినియోగదారుల ప్రాధాన్యతలు, ఈవీ బీమాలో కోరుకుంటున్న మార్పుల గురించి తన నివేదికలో పేర్కొంది.

భారత్‌లోని ప్రధాన నగరాల్లో విద్యుత్‌ వాహనాలు వినియోగిస్తున్న 500 మందిపై ఐసీఐసీఐ లాంబార్డ్‌ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. కర్భన ఉద్గారాలు తగ్గుతాయని 77 శాతం మంది విద్యుత్‌ వాహనాలను వినియోగిస్తున్నారని, వీరిలో యువకులే 81 శాతంగా ఉన్నారని పేర్కొంది. ఈవీల పట్ల ఆసక్తి చూపుతున్నా 61 శాతం మంది బ్యాటరీ ఛార్జింగ్‌ సమయం పట్ల ఆందోళన చెందుతున్నారని వెల్లడించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి వీలు కావడం లేదని 54 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేయగా.. సరిపడా ఛార్జింగ్‌ స్టేషన్లు లేకపోవడంపై 52 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. ముంబయి, చెన్నై, బెంగళూరులోని ఈవీ యూజర్లు బ్యాటరీ ఛార్జింగ్‌ సమయం పట్ల చింతించగా.. హైదరాబాద్‌, దిల్లీలోని వాహనదారులు రేంజ్‌ పట్ల ఆందోళన వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది.

పడుతూ లేస్తూ.. 3 రోజులుగా అదానీ గ్రూప్‌ షేర్లలో ఇదీ పరిస్థితి

వీటి కోసం డిమాండ్‌..

ప్రస్తుతం అందిస్తున్న ఈవీ బీమాల్లో ప్రత్యేక కవరేజ్‌లు ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారని నివేదిక తెలిపింది. 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, బ్యాటరీ రీప్లేస్‌మెంట్ వంటి సదుపాయాలు బీమాలో కవర్‌ చేయాలని.. దాని కోసం అదనపు ప్రీమియం చెల్లించడానికీ తాము సిద్ధంగా ఉన్నట్లు పలువురు వాహనదారులు పేర్కొన్నారు. ఛార్జింగ్‌ స్టేషన్‌ డ్యామేజీకి సంబంధించిన కవరేజీ గురించి 53 శాతం మందికి మాత్రమే అవగాహన ఉందని నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని