Adani Group: పడుతూ లేస్తూ.. 3 రోజులుగా అదానీ గ్రూప్‌ షేర్లలో ఇదీ పరిస్థితి

Adani Group: అదానీ గ్రూప్‌ కంపెనీలు గడిచిన మూడు రోజులుగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. మంగళవారం నాటి నష్టాల నుంచి కోలుకుని బుధవారం మళ్లీ లాభాల్లో ముగిశాయి.

Updated : 05 Jun 2024 18:10 IST

Adani Group | దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు భాజపాకు పట్టం కట్టడంతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉండడంతో భారీగా పతనం అయ్యాయి. అయితే, మరోసారి అధికారం చేపట్టడంలో ఎలాంటి ఢోకా లేదని తేలాకా సూచీలు ఇవాళ మళ్లీ పరుగులు తీశాయి. గడిచిన మూడు రోజులుగా స్టాక్‌ మార్కెట్‌ను పరిశీలిస్తున్న వారికి ఈ ట్రెండ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూచీలతో పాటు అదే స్థాయిలో కదలాడిన స్టాక్స్‌ ఉన్నాయీ అంటే అవి అదానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీ షేర్లే. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఆ కంపెనీ షేర్లు.. అయితే భారీ నష్టాలు.. లేదంటే భారీ లాభాలను చవిచూశాయి. అంతలా ఆ గ్రూప్‌ షేర్లన్నీ ఒడుదొడుకులకు లోనయ్యాయి. బుధవారం మళ్లీ లాభాల్లో ముగిశాయి.

ఎగ్జిట్ అంచనాలతో: శనివారం ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలన్నీ మోదీ ప్రభుత్వానికి భారీ మెజార్టీ ఖాయమని చెప్పడంతో సోమవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు భారీగా రాణించాయి. అదానీ గ్రూప్‌ కంపెనీలూ అదే స్థాయిలో పెరిగాయి. గ్రూప్‌ కంపెనీల్లో ఒకటైన అదానీ పవర్‌ ఏకంగా 16 శాతం లాభపడింది. దీంతో మొత్తం 10 లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.19.42 లక్షల కోట్లకు చేరింది.

రిజల్ట్స్‌ డే.. లోయర్‌ సర్క్యూట్‌: జూన్ 4న మంగళవారం మార్కెట్లు ఎన్నడూ చూడని పతనాన్ని చూశాయి. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తలకిందులవ్వడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ కంపెనీలూ తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌ ఏకంగా 25 శాతం చొప్పున క్షీణించి లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అంబుజా సిమెంట్‌ 22.5 శాతం నష్టపోయింది.

సూచీలతో పాటే..: మంగళవారం నాటి భారీ నష్టాల నుంచి అదానీ గ్రూప్‌ కంపెనీలు మళ్లీ కోలుకున్నాయి. సూచీలు కోలుకోవడం, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో రాణించాయి. గ్రూప్‌ కంపెనీల్లో పదింటిలో 9 కంపెనీలు లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ 11 శాతం, అదానీ పోర్ట్స్‌ 8.59 శాతం, అంబుజా సిమెంట్స్‌ 7.47 శాతం, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 6.02 శాతం చొప్పున రాణించాయి. ఏసీసీ, ఎన్డీటీవీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్మర్‌, అదానీ పవర్‌ సైతం స్వల్పంగా లాభపడ్డాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ ఒక్కటే 2.58 శాతం నష్టంతో ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని