Ramky infra: 75% పెరిగిన రాంకీ ఇన్‌ఫ్రా లాభం

మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది.

Published : 30 May 2024 03:39 IST

గల్ఫ్‌ దేశాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నాలు 

ఈనాడు, హైదరాబాద్‌: మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి స్టాండలోన్‌ ఖాతాల ప్రకారం ఈ సంస్థ రూ.548 కోట్ల ఆదాయం, రూ.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్‌ రూ.12 ఉంది. 2022-23 ఇదే కాలంలో ఆదాయం రూ.441 కోట్లు, నికరలాభం రూ.48 కోట్లు, ఈపీఎస్‌ రూ.7 ఉన్నాయి. దీంతో పోల్చితే ఆదాయం 24%, నికరలాభం 75% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి  రూ.2,033 కోట్ల ఆదాయం, రూ.360 కోట్ల నికరలాభం, రూ.52 ఈపీఎస్‌ను సంస్థ నమోదు చేసింది. 2022-23లో ఆదాయం రూ.1,474 కోట్లు, నికరలాభం రూ.214 కోట్లు, ఈపీఎస్‌ రూ.31 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 38%, నికరలాభం 68% పెరిగాయి. 

ఏకీకృత ఖాతాల ప్రకారం ఈ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,161 కోట్ల ఆదాయం, రూ.321 కోట్ల నికర లాభం, రూ.44.48 ఈపీఎస్‌ నమోదు చేసింది. 

రూ.9,300 కోట్ల ఆర్డర్‌ బుక్‌: కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.9,300 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు ఎండీ వై.ఆర్‌.నాగరాజ, సీఎఫ్‌ఓ ఎన్‌.ఎస్‌.రావు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వ్యాపార పరమైన అడ్డంకులు, నగదు లభ్యత సమస్యలు ఎదురైనా, వాటిని అధిగమించి మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కంపెనీకి ఉన్న అప్పు చాలా వరకూ తీర్చినట్లు, ఇకపై స్థిరమైన వృద్ధి సాధించే దిశగా ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఔషధ పార్కుల ఏర్పాటుకు..: ప్రధానంగా పారిశ్రామిక, అర్బన్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు, ఈ విభాగంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వై.ఆర్‌.నాగరాజ పేర్కొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఔషధ పార్కులు ఏర్పాటు చేసే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్‌ దేశాల్లో దాదాపు రూ.1,000 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన పర్యావరణ ప్రాజెక్టులను సంయుక్త భాగస్వాములతో కలిసి చేపట్టేందుకు సన్నద్ధం అవుతున్నామన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం వచ్చే ఆరు నెలల వ్యవధిలో రూ.280 కోట్ల రుణం సమీకరించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో ఉన్న ఆర్డర్లు, ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే మూడు నుంచి అయిదేళ్ల పాటు మెరుగైన ఆదాయాలు సాధించే అవకాశం ఉందని స్పష్టమవుతుందన్నారు. 


65% తగ్గిన టాటా స్టీల్‌ లాభం 

డివిడెండ్‌ 360%

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో టాటా స్టీల్‌ రూ.554.56 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.1,566.24 కోట్లతో పోలిస్తే ఇది 64.59%  తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం కూడా రూ.63,131.08 కోట్ల నుంచి రూ.58,863.22 కోట్లకు తగ్గింది. వ్యయాలూ రూ.59,918.15 కోట్ల నుంచి రూ.56,496.88 కోట్లకు పరిమితమయ్యాయి. 

రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.3.60 (360%) డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. 

రూ.3,000 కోట్ల నిధుల సమీకరణ:  ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన మార్పిడి రహిత డిబెంచర్ల (ఎన్‌సీడీల)ను జారీ చేయడం ద్వారా రూ.3,000 కోట్ల వరకు నిధుల్ని సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. విదేశీ అనుబంధ సంస్థ టి స్టీల్‌ హోల్డింగ్స్‌ ప్రై.లి (టీఎస్‌హెచ్‌పీ)లోకి ఈక్విటీ షేర్ల సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా 2.11 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.17,407.50 కోట్లు) నిధులను ఒకటి లేదా అనేక దశల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో చొప్పించేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది.


హెరిటేజ్‌ ఫుడ్స్‌ డివిడెండ్‌ 50%

ఈనాడు, హైదరాబాద్‌:  హెరిటేజ్‌ ఫుడ్స్, ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.950 కోట్ల ఆదాయాన్ని, రూ.40 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదేకాలంతో పోల్చితే ఆదాయం 16.3%, నికరలాభం 126.3% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రూ.3,793 కోట్ల ఆదాయాన్ని, రూ.106 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23తో పోల్చితే ఆదాయం 17.1%, నికరలాభం 83.6% పెరిగాయి. రూ.5 ముఖ విలువ గల  ఒక్కో షేరుకు రూ.2.50 చొప్పున (50%) డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రతిపాదించింది. కంపెనీ వాటాదార్ల వార్షిక సమావేశాన్ని (ఏజీఎం) ఆగస్టు 21న నిర్వహించనున్నారు. పాల సేకరణ, అమ్మకాలు సమీక్షా త్రైమాసికంలో పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. విలువ జతచేర్చిన ఉత్పత్తుల అమ్మకాల్లో  21.82% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. కొంతకాలంగా తాము అమలు చేసిన విధానాలు ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నాయని హెరిటేజ్‌ ఫుడ్స్‌  ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రాహ్మణి నారా అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని