Screen time: రోజులో 3 గంటలు సెల్‌తోనే.. స్క్రీన్‌టైమ్‌పై తల్లిదండ్రుల ఆందోళన!

సెలవులు వస్తున్నాయంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. పిల్లలు ఎక్కువ సమయాన్ని స్క్రీన్‌చూస్తూనే గడిపేస్తారు, వారిలో చురుకుదనం క్షీణిస్తుంది అంటూ దిగులు చెందుతున్నారు. 

Published : 18 Apr 2023 21:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవి సెలవులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని పిల్లలతో పాటూ తల్లిదండ్రులూ ఎదురుచూస్తుంటారు. ఎక్కువసేపు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం అప్పుడే వస్తుంది కాబట్టి. పిల్లలైతే తల్లిదండ్రుల పనుల్లో సాయం చేస్తుంటారు. పిల్లలతో కలసి ఆడుకుంటూ వారు చెప్పే కబుర్లు వింటూ తమ శ్రమనంతా మరచిపోతుంటారు తల్లిదండ్రులు. ఇలా వేసవి సెలవులు తెలియకుండానే గడిపేస్తుంటారు. కానీ, ఇప్పటి పరిస్థితి అందుకు విరుద్ధం. త్వరలో వేసవి సెలవులు ప్రారంభం కానున్న వేళ తల్లిదండ్రుల్లో కొత్త గుబులు మొదలైంది. ఎక్కడ మొబైల్‌ స్క్రీన్‌కు అతుక్కుపోతారో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీనిపై అమెజాన్‌ కోసం కాంటార్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సెలవులు అంటేనే పాఠశాలకు విరామం పలకడం. విహార యాత్రకు వెళ్లడం.. పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటాయించడం. కానీ, ఇప్పుడు ఖాళీ సమయం దొరకగానే పిల్లలు స్క్రీన్‌కే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితులపై వివిధ నగరాలు, పట్టణాల్లో 750 మంది తల్లిదండ్రులపై (3-8 ఏళ్ల వయసు చిన్నారులు కలిగిన) కాంటార్‌ సంస్థ సర్వే నిర్వహించింది. తమ పిల్లలు ఎక్కడ మొబైల్ స్క్రీన్‌ చూస్తూ సెలవులు గడిపేస్తారోనని దాదాపు 85 శాతం మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో ఆందోళన వ్యక్తంచేశారట. స్క్రీన్‌కే ఎక్కువ సమయం కేటాయించటంతో వారు చురుగ్గా ఉండడం లేదని 90 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని సర్వే తెలిపింది. తమ పిల్లలు స్క్రీన్‌ టైమ్‌ రెండు గంటలకంటే తక్కువ ఉండాలని మెజారిటీ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కానీ, అందుకు విరుద్ధంగా 69 శాతం మంది పిల్లలు రోజూ మూడు గంటల కంటే ఎక్కువ సమయాన్ని స్క్రీన్‌ వీక్షించటానికే కేటాయిస్తున్నారని సర్వే ద్వారా వెల్లడైంది.

96 శాతం తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్క్రీన్‌వైపు ఆకర్షితులు కాకుండా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌లో వెతుకులాడుతున్నారని మరో ఆసక్తికర విషయాన్ని సర్వే వెల్లడించింది. ‘సాధారణంగా పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతుంటారు. అన్నింటిలోనూ వినోదాన్ని వెతుక్కుంటారు. వేసవి సెలవుల్లో ఈ సమయాన్ని పిల్లలకు ఉపయోగపడేలా మార్చుకోవటం తల్లిదండ్రులకు నిజంగా సవాలే. అందుకనే స్క్రీన్‌ ఎంత సేపు చూడాలో ఒక నియమం పెట్టాలి. దాంతో పాటు వారికి బయటకు వెళ్లి ఆడుకొనే విధంగా ప్రోత్సహించాలి. వినోదాన్ని నింపే పాటలు, డ్యాన్సులు, ఏదైనా వాయిద్యం పట్ల ఆసక్తి ఉంటే వాటిని నేర్పించటం ఇవన్నీ వారి స్క్రీన్‌వైపు ఎక్కువ సేపు ఆకర్షితులు కాకుండా నిలవరించొచ్చు’’ అని సర్వే నిర్వహించిన కాంటార్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపిందర్‌ రాణా అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని