Adani Group: రూ.29,100 కోట్ల సమీకరణలో అదానీ గ్రూప్‌

గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ భారీగా నిధుల వేటలో పడింది. గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటా విక్రయం ద్వారా రూ.16,600 కోట్లు (దాదాపు 2 బిలియన్‌ డాలర్లు) సమీకరించడానికి మంగళవారం బోర్డు ఆమోదం తెలిపింది.

Published : 29 May 2024 03:30 IST

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాటా అమ్మకంతోనే రూ.16,600 కోట్లు

దిల్లీ: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ భారీగా నిధుల వేటలో పడింది. గ్రూప్‌లో ప్రధాన సంస్థ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటా విక్రయం ద్వారా రూ.16,600 కోట్లు (దాదాపు 2 బిలియన్‌ డాలర్లు) సమీకరించడానికి మంగళవారం బోర్డు ఆమోదం తెలిపింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ బోర్డు కూడా క్యూఐపీ లేదా ఇతర పద్ధతుల ద్వారా రూ.12,500 కోట్ల మేర నిధులను సమీకరించడానికి సోమవారం అనుమతి తెలపడం గమనార్హం. ఈ రెండు కలిపి రూ.29,100 కోట్లు అవుతుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దశల్లో నిధుల సమీకరణ జరుగుతుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఇందుకోసం ఇరు కంపెనీలు తమ వాటాదార్ల నుంచి ఆమోదం సహా ఇతర అనుమతులూ పొందాల్సి ఉంది. నిధుల సమీకరణకు ఆమోదం పొందేందుకు జూన్‌ 24న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాటాదార్ల సమావేశం ఏర్పాటు చేయనుంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌ తన వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్‌)ను ఆ తర్వాతి రోజు నిర్వహించనుంది.  

గతంలోనే అనుమతులు

2023లోనే ఈ కంపెనీలు నిధుల సమీకరణకు అనుమతులు పొందినా.. జూన్‌లో వాటికి గడువు తీరనుండడంతో, మళ్లీ అనుమతుల అవసరం వచ్చింది. అర్హత గల సంస్థాగత మదుపర్ల(క్యూఐపీ)కు షేర్ల కేటాయింపు ద్వారా రూ.12500 కోట్ల సమీకరణకు 2023 మేలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బోర్డు అనుమతి తెలిపింది. క్యూఐపీ ద్వారా రూ.8500 కోట్ల సమీకరణకు అదే నెలలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సొల్యూషన్స్‌ బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. అదానీ కుటుంబానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 72.61% వాటా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో 73.22% వాటాలున్నాయి.

ఎట్టకేలకు.. 

గతేడాది హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో వచ్చిన ఇబ్బందుల నుంచి బయటపడిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ నిధుల సమీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఆ సమయంలో అదానీ గ్రూప్‌ షేర్లు డీలా పడడంతో 150 బిలియన్‌ డాలర్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీల్లో నాలుగు, హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు స్థాయిలకు చేరాయి. గౌతమ్‌ అదానీ నికర విలువ ఈ ఏడాదిలో 25 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి 109 బి. డాలర్లకు చేరడం విశేషమే. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో అదానీ 13వ స్థానంలో ఉన్నారు. ముకేశ్‌ అంబానీ(114 బి. డాలర్లు) కంటే ఒక స్థానం దిగువన ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు ఎఫ్‌పీఓ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మేర సమీకరించడానికి ప్రణాళికలు రచించుకున్నా.. నివేదిక ప్రభావంతో వాటిని విరమించుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు