Adani Group shares: భారీ నష్టాల్లో అదానీ గ్రూప్‌ షేర్లు.. అదానీ పోర్ట్స్‌ 20% డౌన్‌

Adani Group shares: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పెద్దఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల కంటే భాజపా తక్కువ మొత్తంలో సీట్లను దక్కించుకోవడంతో షేర్లు కుప్పకూలాయి.

Updated : 04 Jun 2024 16:12 IST

Adani Group shares | ఇంటర్నెట్‌డెస్క్‌: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ (Adani group) కుప్పకూలాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల కంటే భిన్నంగా ఫలితాలు ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు పెద్దఎత్తున అమ్మకాలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని.. 150 సీట్లకు కాస్త అటూఇటూగా ఇండియా కూటమి పరిమితం అవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు నష్టాలు చవిచూశాయి. 

ముఖ్యంగా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అదానీ పోర్ట్స్‌ షేర్లు ఏకంగా 21.40 శాతం క్షీణించగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం నష్టపోయాయి. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 19.07శాతం నష్టపోయింది. అదానీ పవర్‌ షేర్లు 17.55 శాతం, అంబుజా సిమెంట్స్ 16.10 శాతం తగ్గాయి. అదానీ టోటల్ గ్యాస్‌ 18.53 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 19.43 శాతం, ఎన్‌డీటీవీ 19.25 శాతం, ఏసీసీ 15.01 శాతం, అదానీ విల్మర్‌ 9.99 శాతం చొప్పున నష్టపోయాయి.

మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో రికార్డు గరిష్ఠాలను నమోదుచేసిన సూచీలు ఈరోజు పెద్దఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టంతో 76,285.78 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,000 పాయింట్లకు పైగా కుంగి 70,234 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్ల వరకు కుంగి 21,281 దగ్గర దిగువ స్థాయికి చేరింది. చివరకు 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని