Adani Paytm: పేటీఎం షేరుకు అదానీ హైప్‌!

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో వాటా కొనేందుకు అదానీ గ్రూపు చర్చలు జరుపుతోందంటూ వచ్చిన ఊహాగానాలతో, బుధవారం పేటీఎం షేరు అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

Published : 30 May 2024 03:43 IST

వాటా కొనుగోలుకు చర్చలే జరగలేదన్న ఇరు సంస్థలు

దిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో వాటా కొనేందుకు అదానీ గ్రూపు చర్చలు జరుపుతోందంటూ వచ్చిన ఊహాగానాలతో, బుధవారం పేటీఎం షేరు అప్పర్‌        సర్క్యూట్‌ను తాకింది. అయితే అటువంటి సంప్రదింపులు ఏమీ జరగలేదని ఇరు సంస్థలు ప్రకటించాయి. అదానీ గ్రూప్‌ ఇకామర్స్, చెల్లింపుల లావాదేవీల్లోకి ప్రవేశించేందుకు చూస్తుందంటూ వార్తలు వచ్చిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ‘వాటా కొనుగోలు కోసం పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మతో, అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన ఊహాగానాలను ఖండిస్తున్నాం. ఇది పూర్తిగా అవాస్తవం, నిరాధారం. పేటీఎంలో వాటా కొనుగోలుపై కంపెనీ ఎటువంటి చర్చలు జరపలేద’ని అదానీ గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు. 

ఇదీ నేపథ్యం: ఈ ఏడాది మార్చి చివరికి పేటీఎంలో సంస్థ సీఈఓ శర్మకు వ్యక్తిగతంగా 9.1%, విదేశీ సంస్థ రీసైలెంట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా మరో 10.3% వాటా (మొత్తం 19.4%) ఉంది. కాగా పేటీఎంలో ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ వాటా కొనుగోలు చేయనున్నట్లు గత ఫిబ్రవరిలో వార్తలు రాగా, ఇరు సంస్థలు  కొట్టిపారేశాయి. తాజాగా పేటీఎంలో వాటా విక్రయంపై చర్చించేందుకు అహ్మదాబాద్‌లోని గౌతమ్‌ అదానీ కార్యాలయానికి పేటీఎం సీఈఓ శర్మ వెళ్లినట్లు ఓ వార్తా కథనం రావడం తాజా పరిణామానికి నేపథ్యం.  

దూసుకెళ్లిన షేరు: తాజా ఊహాగానాల నడుమ వన్‌97 కమ్యూనికేషన్‌ షేరు బుధవారం బీఎస్‌ఈలో 4.99% పెరిగి రూ.359.55 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 4.99% పెరిగి రూ.359.45 వద్ద ముగిసింది. రోజులో ఈ షేరు ట్రేడింగ్‌కు అనుమతి ఉన్న గరిష్ఠ పరిమితి స్థాయి ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని