EPFO కీలక నిర్ణయం.. 1.16% అదనపు చెల్లింపు యజమాని వాటా నుంచే..

అధిక పింఛను (Higher Pension) కోసం ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి వేతనంపై 1.16శాతం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని యజమాని వాటా నుంచే తీసుకోనున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO) వెల్లడించింది.

Updated : 04 May 2023 17:38 IST

దిల్లీ: ఉద్యోగుల పింఛను పథకం (EPS - 95) కింద అధిక పింఛను (Higher Pension)కు ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు... రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై EPFO వెనక్కి తగ్గింది. ఈ మొత్తాన్ని యజమాని వాటా నుంచే సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ఉద్యోగుల భవిష్య నిధి (Provident Fund)కి యజమానుల ఇచ్చే వాటా మొత్తం 12 శాతంలోనే ఈ 1.16 శాతం అదనపు చెల్లింపును ఉద్యోగుల పింఛను పథకానికి (Employees Pension Scheme) తీసుకుంటాం’’ అని కార్మిక శాఖ వెల్లడించింది. అంటే అధిక పింఛను కోసం ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన వేతనంపై ఇక 1.16 శాతం చొప్పున చెల్లించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిబంధనను సవరించినట్లు కార్మిక శాఖ తెలిపింది. ఈ మేరకు మే 3 తేదీతో రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఎందుకీ 1.16 శాతం..?

పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్‌వో (EPFO) 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. అంతకుముందు అధిక వేతనంపై అధిక పింఛను కోసం యజమానితో కలిసి పేరా 11 (3)కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులంతా.. సవరణ తర్వాత పేరా 11 (4) కింద ఆరునెలల్లోగా మరోసారి ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. లేదంటే ఆ ఉద్యోగి అధిక పింఛను ఆప్షన్‌ను వదులుకున్నట్లుగా భావిస్తారు. దీంతో పాటు 11 (4) కింద ఆరునెలల్లోగా అధిక పింఛను (Higher Pension) కోసం ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి అదనపు వేతనంపై 1.16% చొప్పున తనవంతు వాటాగా ఇవ్వాలని ఈపీఎఫ్‌వో షరతు పెట్టింది.

దీనిపై అభ్యంతరాలు రావడంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పింఛను నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు గతేడాది నవంబరులో ఉత్తర్వులిచ్చింది. ఆ లోగా ఇతర మార్గాల ద్వారా ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈపీఎఫ్‌వో (EPFO) తాజాగా నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ఉద్యోగుల భవిష్యనిధికి యజమానుల వాటా కింద జమ అయ్యే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌ (EPS)లోకి వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్‌ (EPF) ఖాతాలో జమ చేస్తారు. తాజా నిర్ణయంతో 1.16 శాతం అదనపు చెల్లింపు కూడా యజమాని అందించే ఈ 12 శాతంలోనే ఉంది. దీంతో యజమాని నుంచి ఈపీఎస్‌ కింద వసూలు చేసే 8.33 శాతం వాటా పెరిగి 9.49 శాతానికి పెరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని