Air India: విమాన టికెట్‌ ధరలు లాక్‌.. ఎయిరిండియా కొత్త సదుపాయం

Air India: విమాన టికెట్‌ ధరలను లాక్‌ చేసుకునే సదుపాయాన్ని ఎయిరిండియా తీసుకొచ్చింది. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

Published : 05 Jun 2024 14:04 IST

Air India | దిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమాన ప్రయాణానికి టికెట్ల ధరలను రెండ్రోజుల పాటు లాక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ద్వారా విమాన టికెట్ ధరలు మారకుండా ప్రయాణికులు తమ ట్రిప్‌ ప్లాన్ చేసుకోవచ్చు.

సాధారణంగా విమాన టికెట్‌ ధరలు నిత్యం మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ప్రయాణానికి తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ ధరలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు అమాంతం పెరిగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. విమాన టికెట్‌ ధరలు ఇలా మారిపోకుండా ఉండేందుకు ఫేర్‌ లాక్ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది.

ఫేర్‌ లాక్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే తొలుత నాన్ రిఫండబుల్‌ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఎయిరిండియా వెబ్‌సైట్‌లో గానీ, మొబైల్ యాప్‌లో గానీ మేనేజ్‌ బుకింగ్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లి మిగిలిన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఒక్కో వ్యక్తికి దేశీయ విమాన సర్వీసులకు రూ.500, తక్కువ దూరం అంతర్జాతీయ విమాన ప్రయాణానికి రూ.850, సుదూర అంతర్జాతీయ ప్రయాణానికి రూ.1500 చొప్పున ముందస్తు చెల్లించి టికెట్‌ ధరను లాక్ చేసుకోవచ్చు. ఏదైనా కారణంతో టికెట్ బుక్‌ చేసుకోకపోతే ఆ మొత్తం తిరిగి రాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని