Airtel: ఎయిర్‌టెల్‌ బిజినెస్ సీఈవో రాజీనామా

ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ (Airtel Business) సీఈవో పదవికి అజయ్‌ చిత్కారా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ (Airtel) నాయకత్వాన్ని సంస్థ మూడు విభాగాలుగా విభజించింది. 

Published : 26 Jun 2023 17:55 IST

ముంబయి: దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel)కు చెందిన ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ విభాగం సీఈవో అజయ్‌ చిత్కారా (Ajay Chitkara) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటన చేసింది. మరో రెండునెలలపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని తెలిపింది. అజయ్‌ రాజీనామా నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌లో నాయకత్వాన్ని మూడు విభాగాలుగా విభజించింది. ఇకపై ఎయిర్‌టెల్‌ అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాలను వాణి వెంకటేష్‌, దేశీయ వ్యాపారాల నిర్వహణను గణేష్‌ లక్ష్మీనారాయణన్‌, ఎన్‌క్స్‌ట్రా డేటా సెంటర్ల బాధ్యతలను అశిష్‌ అరోరా నిర్వహిస్తారని సంస్థ వెల్లడించింది. 

‘‘గత 23 ఏళ్లుగా అజయ్‌ ఎయిర్‌టెల్‌తో కలిసి పనిచేశారు. సంస్థ వ్యాపార విస్తరణలో ఆయన ఎంతో కీలకంగా వ్యవహిరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారావకాశాలను అందిపుచ్చుకుని ఎయిర్‌టెల్‌ ముందుకు సాగుతుంది. కొత్త బిజినెస్‌ హెడ్‌లు వాణీ, గణేష్‌, అశిష్‌లతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్‌ తెలిపారు. ఎయిర్‌టెల్‌ బిజినెస్‌ విభాగం ద్వారానే పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు ఎయిర్‌టెల్‌ ఐసీటీ సేవలను అందిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని