Airtel: ఎయిర్‌టెల్‌ లాభంలో 54% వృద్ధి.. ₹200 దాటిన ARPU

Airtel Results: ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో 54 శాతం వృద్ధితో రూ.2,442 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

Published : 05 Feb 2024 19:49 IST

Airtel | దిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,442.2 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.1588.2 కోట్లుగా ఉంది. నికర లాభంలో 54 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 5.8 శాతం వృద్ధి చెందింది. రూ.35,804.4 కోట్లుగా ఉన్న ఆదాయం రూ.37,899.5 కోట్లకు పెరిగింది. ఎయిర్‌టెల్‌ దేశీయ ఆదాయం 11.4 శాతం పెరిగి రూ.27,811 కోట్లుగా నమోదైంది.

ఎయిర్‌టెల్‌ మొత్తం కస్టమర్ల సంఖ్య 55.1 కోట్లు. ఇందులో ఆఫ్రికా కస్టమర్ల సంఖ్య 15.17 కోట్లు కాగా.. భారత కస్టమర్ల సంఖ్య 39.7 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. దేశీయ కస్టమర్ల సంఖ్యలో 7.5 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. టెలికాం ఆపరేటర్ల వృద్ధిని సూచించే యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ.193 నుంచి రూ.208కి చేరింది. ప్రీమియమైజేషనే దీనికి కారణమని ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు.

Paytm crisis: ‘భయపడొద్దు’.. ఉద్యోగులకు పేటీఎం బాస్‌ భరోసా

సమీక్షా త్రైమాసికంలో 74 లక్షల మంది 4జీ/5జీ కస్టమర్లు నెట్‌వర్క్‌లోకి వచ్చినట్లు తెలిపారు. కంపెనీ పెట్టుబడి ప్రతిఫలం 9.4 శాతంగా ఉందని, ఈ మొత్తం పెరగాలంటే ఛార్జీలు పెంపు అనివార్యమని చెప్పారు. ఓవిధంగా భవిష్యత్‌లో టారిఫ్‌ల పెంపు ఉంటుందని సంకేతాలిచ్చారు. మెరుగైన కనెక్టివిటీ కోసం ఇదే త్రైమాసికంలో 12.3 వేల కొత్త టవర్లను ఏర్పాటుచేశామని, ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఇండియా యూజర్ల సగటు డేటా వినియోగం 22జీబీగా ఉందని పేర్కొన్నారు. ఇక ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వ్యాపారం 29.2 శాతం వృద్ధితో 73 లక్షలకు చేరుకుంది. ARPU రూ.583గా ఉంది. ఎయిర్‌టెల్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 17,924గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని