Paytm crisis: ‘భయపడొద్దు’.. ఉద్యోగులకు పేటీఎం బాస్‌ భరోసా

Vijay Shekhar Sharma: పేటీఎంపై నెలకొన్న అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఉద్యోగులకు భరోసానిచ్చారు. ఉద్యోగాలపై భయాందోళనలు అవసరం లేదని చెప్పారు.

Updated : 05 Feb 2024 17:35 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (Paytm payments bank) భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ (Vijay Shekhar Sharma) ఉద్యోగులతో భేటీ అయ్యారు. కంపెనీ భవిష్యత్‌పై ఆందోళన చెందొద్దని, ఉద్యోగులకు ఎలాంటి ముప్పూ లేదని భరోసానిచ్చారు. కంపెనీలో ఎలాంటి లేఆఫ్‌లు చేపట్టడం లేదన్నారు. ఆర్‌బీఐతో సంప్రదింపులు జరుపుతామన్నారు. వివిధ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉద్యోగులతో విజయ్‌ శేఖర్‌ శర్మ టౌన్‌హాల్‌లో మీటింగ్‌ నిర్వహించారు. దాదాపు 800-900 మంది ఉద్యోగులతో గంటకు పైగా మాట్లాడారు. సరిగ్గా ఏం జరిగిందనేది తెలీనప్పటికీ.. మరికొన్ని రోజుల్లో సమస్యలు పరిష్కరించుకోగలమని భరోసా ఇచ్చారు. ‘‘పేటీఎం కుటుంబంలో మీరంతా  సభ్యులు. మీ ఉద్యోగాలపై ఆందోళన అవసరం లేదు’’ అని విజయ్‌శేఖర్‌ శర్మ చెప్పినట్లు కొందరు సీనియర్‌ ఉద్యోగులు తెలిపారు.

ఆర్‌బీఐ ఆంక్షలు.. Paytm షేర్లలో కొనసాగుతున్న అమ్మకాలు

బ్యాంకులతో సంప్రదింపులు

మరోవైపు పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాలను బదిలీ చేసేందుకు పేటీఎం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదే విషయాన్ని టౌన్‌హాల్‌ మీటింగ్‌లో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రస్తావించారు. అయితే, ఇప్పటికిప్పుడు పేటీఎంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఏ బ్యాంకూ సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఆర్‌బీఐ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాకే ముందుకెళ్లాలని పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులు భావిస్తున్నాయి. ఒకవేళ అకౌంట్లు ఇతర బ్యాంకులకు బదిలీ చేసినా.. పేటీఎం యాప్‌లోనే సేవలు కొనసాగుతాయి. స్పాన్సర్‌ బ్యాంక్‌ మాత్రమే మారుతుంది. ఇప్పటికే పేటీఎం వినియోగదారులకు సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్‌బీఐ ప్రకటించింది. ఒకవేళ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేస్తే పేటీఎంను కాపాడేందుకు మేం నేరుగా వెళ్లే ప్రణాళిక ఏదీ ఉండబోదని బ్యాంక్‌ ఛైర్మన్‌ దినేశ్‌కుమార్‌ స్పష్టంచేశారు. ఆర్‌బీఐ గనుక తమకు మార్గదర్శకాలు జారీ చేసి, ఏదైనా ప్రభావం ఉంటే మేం అక్కడ ఉంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని