Google shares: గూగుల్‌ షేర్లకు ‘బార్డ్‌’ దెబ్బ.. 100 బి.డా. మార్కెట్‌ విలువ ఆవిరి!

Alphabet Shares Lose 100 Billion dollors: ఏఐ చాట్‌బాట్‌ ‘బార్డ్‌’కు సంబంధించిన ప్రమోషనల్‌ వీడియోలోని ఓ తప్పిదం గూగుల్‌ షేర్లపై గట్టి ప్రభావమే చూపింది. ఏకంగా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఆవిరైంది.

Published : 09 Feb 2023 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి (chatGPT) పోటీగా బార్డ్ (Bard) పేరిట గూగుల్‌ (Google) తీసుకొచ్చిన చాట్‌బాట్‌ ఆదిలోనే షాకిచ్చింది. ప్రమోషనల్‌ వీడియోలో చిన్న తప్పిదం ఆ కంపెనీ షేర్లపై పెను ప్రభావమే చూపింది. దీంతో గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ (Alphabet Inc) మార్కెట్‌ విలువ ఏకంగా 100 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది.

ఏఐ ఆధారిత చాట్‌జీపీటీకి మైక్రోసాఫ్ట్‌ భారీగా నిధులు సమకూరుస్తోంది. దీంతో భవిష్యత్తులో గూగుల్‌కు చాట్‌జీపీటీ సవాల్‌ విసరనుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాము సైతం బార్డ్‌ పేరిట ఓ ఏఐ చాట్‌బాట్‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సోమవారం పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఈ క్రమంలో బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్‌ రూపొందిచిన ఓ ప్రమోషనల్‌ వీడియో కంపెనీ కొంపముంచింది. జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు బార్డ్‌ కొన్ని సమాధానాలు ఇచ్చింది. అందులో ఒక సమాధానం తప్పని తేలింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్‌ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్‌ విడుదల చేసిన జిఫ్‌ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో అల్ఫాబెట్‌ షేర్లు ఏకంగా 8 శాతం మేర కుంగాయి. దాదాపు 100 బిలియన్‌ డాలర్ల విలువైన మార్కెట్‌ విలువను కోల్పోయింది. మరోవైపు గూగుల్‌కు పోటీ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్‌ షేర్లు 3 శాతం మేర పెరగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని