Anant-Radhika: అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. ఈ విశేషాలు తెలుసా..!

మొదటిసారి స్టార్ గాయని రిహన్నా భారత్‌కు రానున్నారు. వంతారా స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది. ఇలా అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో విశేషాలెన్నో..!

Published : 26 Feb 2024 17:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. ! అన్నట్టుగా భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. దేశ, విదేశీ ప్రముఖులు దీనికి హాజరవుతుండటంతో మూడు రోజుల పాటు జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలు టాక్‌ ఆఫ్ ది ఇంటర్నేషనల్‌గా మారిపోయాయి. అంబరాన్నంటనున్న ఈ సంబరాల్లోని ప్రత్యేకతలేంటో చూద్దామా..?

  • ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ(Anant Ambani) జులైలో రాధికా మర్చంట్‌(Radhika Merchant)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి మూడు రోజులపాటు జరగనున్న ప్రీవెడ్డింగ్ వేడుకలకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌(Jamnagar) వేదికైంది. ఇందుకోసం అతిథులకు 9 పేజీల ఈవెంట్ గైడ్‌ను నిర్వాహకులు పంపించారట. వారిని తీసుకువెళ్లేందుకు మార్చి ఒకటి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ముంబయి, దిల్లీ నుంచి జామ్‌నగర్‌కు ఛార్టర్డ్‌ ఫ్లైట్స్‌ నడపనున్నారు. లగేజ్‌, డ్రెస్‌కోడ్‌ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. అలాగే వైద్యసేవలు, డైట్‌కు తగ్గ ఫుడ్‌ అందుబాటులో ఉండనుంది. జామ్‌నగర్‌లో 5 స్టార్‌ హోటళ్లు లేకపోవడంతో.. అల్ట్రా- లగ్జరీ టెంట్‌లను ఏర్పాటుచేస్తున్నారు. అతిధుల కోసం ఏర్పాటుచేసే ఈ టెంట్‌ల్లో టైల్డ్‌ బాత్‌రూమ్‌లు సహా సర్వసదుపాయాలు ఉంటాయి. 
  • ఈ మూడు రోజులు పాటలు, నృత్యాలతో ఆ వేదిక హోరెత్తనుంది. గ్లోబల్‌ పాప్‌ స్టార్ రిహన్నాతో పాటు దిల్జీత్‌ దోసాన్జ్‌, ఇతర గాయకులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకోసం రిహన్నా మొదటిసారి భారత్‌కు రానున్నారు. 
  • జామ్‌నగర్ టౌన్‌షిప్‌ కాంప్లెక్స్‌లో హస్తాక్షర్ (సంతకాలు) పేరిట ఒక సంప్రదాయ కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత వారసత్వ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తుల్లో ఇది జరగనుంది. ఆ నగరంలో దేశ సంస్కృతీసంప్రదాయాలకు అనుగుణంగా పలు ఆలయాల నిర్మాణానికి అంబానీ కుటుంబం సహకరించింది. గతంలో ముకేశ్‌ సతీమణి  నీతూ అంబానీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆమె ఈ ప్రాంతాన్ని సందర్శించారు. 
  • కొన్ని దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యల ఫలితాన్ని అతిథులు ఆస్వాదించనున్నారు. అలాగే అనంత్‌ అంబానీ ప్రారంభించిన వంతారా ప్రోగ్రామ్‌ కింద జంతు సంరక్షణ, పునరావాసం కోసం చేపడుతున్న పనులను వీక్షించనున్నారు. మూగజీవుల్లో దైవాన్ని చూసే అనంత్‌ హృదయమే వంతారాకు పునాది వేసింది. అక్కడ రెండు వేలకు పైగా జంతువులు ఉన్నాయి. 
  • అనంత్‌.. రిలయన్స్ గ్రూప్‌లోని న్యూఎనర్జీ విభాగం బాధ్యతలు చూస్తున్నారు. ఇందులోభాగంగా ఎక్కువ సమయం ఆయన అక్కడే ఉంటున్నారని గతంలో ఓసారి ముకేశ్ అన్నారు. ఆ వేదికే ఇప్పుడు ప్రపంచస్థాయి అతిథులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు