Stock Market Today: పరిమిత లాభాలకు అవకాశం

కొత్త ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకోబోయే విధానాలపై కొంత స్పష్టత వచ్చేంత వరకు స్టాక్‌మార్కెట్లో లాభాలు పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Published : 10 Jun 2024 02:08 IST

కొత్త ప్రభుత్వ విధానాలపై స్పష్టత వచ్చేంత వరకు
కేంద్ర మంత్రుల కూర్పు, బడ్జెట్‌పై మదుపర్ల దృష్టి
దాదాపు అన్ని రంగాల్లోనూ సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

కొత్త ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకోబోయే విధానాలపై కొంత స్పష్టత వచ్చేంత వరకు స్టాక్‌మార్కెట్లో లాభాలు పరిమితంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు, పరపతి విధానం, కార్పొరేట్‌ ఫలితాలు పూర్తి కావడంతో ఇక మంత్రుల కూర్పు, జులైలో ప్రకటించబోయే పూర్తి స్థాయి బడ్జెట్‌పైనే మదుపర్లు దృష్టి సారించనున్నారు. లాభాలు పరిమితంగానే ఉన్నా.. సోమవారం నిఫ్టీ, సెన్సెక్స్‌లు సరికొత్త గరిష్ఠాలకు చేరొచ్చని విశ్లేషకులు అంచనా కడుతున్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 23,000 వద్ద, నిరోధం 23,500 వద్ద కనిపిస్తున్నాయి. ప్రస్తుత విధానాల నుంచి కేంద్రం కాస్త పక్కకు వెళుతుందని కొందరు.. జనాకర్షక సంస్కరణలపై దృష్టి పెంచుతుందని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

  • ఎన్నికల ఫలితాలు, పరపతి విధానంపై అనిశ్చితి తొలగిన నేపథ్యంలో యంత్రపరికరాల షేర్లు రాణించొచ్చు. కాగా, ఏప్రిల్‌-జూన్‌లో ఆర్డర్లు మందగమనం పాలు కావడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరులో కొత్త ప్రభుత్వ ఆర్డర్లు పెరుగుతాయన్న అంచనాలున్నాయి. 
  • ఐటీ షేర్ల ధరలు సౌకర్యవంతంగా ఉండడంతో మదుపర్లు వీటికి ప్రాధాన్యతనిస్తారన్న అంచనాలున్నాయి. స్వల్పకాలంలో నిఫ్టీ ఐటీ సూచీ 35,000-36,000 పాయింట్లను చేరొచ్చని అంచనా. ఐటీ దిగ్గజాల వ్యాఖ్యలను బట్టి ఈ రంగంలో తదుపరి ధోరణులను మదుపర్లు అర్థం చేసుకోవాల్సి ఉంది.
  • లోహ తయారీ కంపెనీల షేర్లు ఈ వారం రాణించవచ్చు. అంతర్జాతీయ సంకేతాల ఆధారంగా ఈ రంగం, ధరలపై బులిష్‌గా ఉన్నట్లు బ్రోకరేజీ ఒకటి పేర్కొంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, వేదాంతా షేర్లపై మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలని అంటోంది. 
  • బలమైన మూలాల కారణంగా ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లూ లాభాలు అందుకోవచ్చు. ఫలితాల అనంతరం చాలా రంగాల్లో బలహీనతలు కనిపించినా.. ఈ రంగ షేర్లు మాత్రం సానుకూలంగానే కదిలాయి. సానుకూల వర్షపాతం, గ్రామీణ గిరాకీపై అంచనాలు, ముడి చమురు ధరల క్షీణత ఈ రంగానికి కలిసిరావొచ్చు.
  • సిమెంటు కంపెనీల షేర్లు ఈ వారం పుంజుకోవచ్చు. సిమెంటు ధరలు పెరుగుతాయన్న అంచనాలున్నా.. వర్షాల కారణంగా అందుకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ధర ఎంత మేర పెరుగుతుందన్నది గమనించాల్సి ఉంటుంది. అల్ట్రాటెక్‌ సిమెంట్, జేకే సిమెంట్‌ షేర్లను పరిశీలించొచ్చని ఓ బ్రోకరేజీ సంస్థ చెబుతోంది. 
  • బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు రాణించే అవకాశం ఉంది. ముడి చమురు ధరల భారాన్ని వినియోగదార్లకు బదిలీ చేయొచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. అయితే అది జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం.
  • ఫార్మా కంపెనీల షేర్లు పరిమితంగానైనా లాభాలను పంచవచ్చు. డాక్టర్‌ రెడ్డీస్‌కు చెందిన శ్రీకాకుళం తయారీ ప్లాంటుపై యూఎస్‌ ఫెడ్‌ నాలుగు అభ్యంతరాలను జారీ చేయడంతో సోమవారం ఈ కంపెనీ షేరు కొంత బలహీనతలను ప్రదర్శించవచ్చు. జుబిలంట్‌ ఫార్మానోవా కూడా నేడు బలహీనంగానే ట్రేడవవచ్చు.
  • టెలికాం కంపెనీల షేర్లు సైతం ముందుకే వెళ్లవచ్చు. స్పెక్ట్రమ్‌ వేలం ఆలస్యం కావడంతో ఈ ఏడాదిలో ఛార్జీల పెంపు ఒకసారి మాత్రమే జరగవచ్చని.. వచ్చే ఏడాది రెండు మూడు సార్లు ఛార్జీల పెంపు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 
  • మార్కెట్‌తో పాటే వాహన కంపెనీల షేర్లు సానుకూల ధోరణిలో ట్రేడవవచ్చు. సాధారణ వర్షపాతంపై అంచనాలు, సమీప భవిష్యత్‌లో రేట్ల కోతపై ఆశలు కలిసి ఈ రంగంపై మదుపర్లు ఆసక్తిని ప్రదర్శించేలా చేయొచ్చు. ఆటో సూచీ 26,000 దిశగా వెళ్లొచ్చని అంచనా.
  • నిఫ్టీ బ్యాంక్‌పై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు. 48,500 వద్ద మద్దతు, 50,000 వద్ద నిరోధం కనిపిస్తున్నాయి. వచ్చే సమావేశంలో ఆర్‌బీఐ తన ధోరణిని మారుస్తుందన్న అంచనాలు కలిసిరావొచ్చు. ఎస్‌బీఐ, బీఓబీ, సిటీ యూనియన్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌పై విశ్లేషకులు ‘బులిష్‌’గా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని