Appollo hospitals: 76% పెరిగిన అపోలో హాస్పిటల్స్‌ లాభం

అపోలో హాస్పిటల్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.4,944 కోట్ల ఆదాయంపై రూ.254 కోట్ల నికర లాభం నమోదైంది.

Published : 31 May 2024 03:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: అపోలో హాస్పిటల్స్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం మార్చి త్రైమాసికానికి రూ.4,944 కోట్ల ఆదాయంపై రూ.254 కోట్ల నికర లాభం నమోదైంది. 2022-23 ఇదేకాల లాభం రూ. 145 కోట్లతో పోల్చితే, ఇది 76% అధికం. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఈ సంస్థ రూ.19,059 కోట్ల ఆదాయాన్ని, రూ.899 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది.   2022-23తో పోల్చితే ఆదాయం 15%, లాభం 33% పెరిగాయి. ఆకర్షణీయ ఫలితాలు నమోదు చేయడంతో పాటు, గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించినట్లు అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి వివరించారు. వైద్య పరిశోధనలను అధికం చేశామని, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

క్యాన్సర్‌ చికిత్సపై అధిక దృష్టి: క్యాన్సర్‌ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున, మనదేశం ‘క్యాన్సర్‌ రాజధాని’ గా మారే ప్రమాదం కనిపిస్తోందని ప్రతాప్‌ సి.రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. అందువల్ల అత్యాధునిక క్యాన్సర్‌ చికిత్సలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెంగళూరులో కృత్రిమ మేధ ఆధారిత క్యాన్సర్‌ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రెయిన్‌ ట్యూమర్‌ చికిత్స కోసం దక్షిణాసియా దేశాల్లోనే తొలిసారిగా జాప్‌-ఎక్స్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు