Apple WWDC24: ఇక ఐఫోన్స్‌లో చాట్‌జీపీటీ.. iOS 18లో పలు కొత్త ఫీచర్లు

Apple: యాపిల్‌ తన వార్షిక ఈవెంట్‌లో కొత్తగా తీసుకురానున్న ఫీచర్ల గురించి ప్రకటించింది. దీంతో పాటు తమ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ సేవల్ని అందించేందుకు ఓపెన్‌ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.

Updated : 11 Jun 2024 15:45 IST

Apple | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతను తమ డివైజుల్లో అందిస్తూ పలు ఎలక్ట్రానిక్‌ సంస్థలు దూసుకుపోతుంటే.. యాపిల్‌ మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. తాజాగా ఆ లోటును భర్తీ చేస్తూ కీలక ప్రకటన చేసింది. తమ పరికరాల్లో చాట్‌జీపీటీని అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించింది. దీనికోసం చాట్‌జీపీటీ (ChatGPT) సంస్థ ఓపెన్‌ ఏఐ (OpenAI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.

కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక ప్రపంచవ్యాప్త డెవలపర్ల సమావేశంలో (WWDC24) కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌ (Tim Cook) కొత్త ఫీచర్లతో పాటు చాట్‌జీపీటీ గురించి ప్రస్తావించారు. యాపిల్‌ ఉత్పత్తులను సులభంగా నావిగేట్‌ చేసేందుకు ఓపెన్‌ ఏఐ భాగస్వామ్యంతో ‘యాపిల్‌ ఇంటెలిజెన్స్‌’ను ఆవిష్కరించారు. ఇక ఐఫోన్లూ రిచ్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ (RCS) సపోర్ట్‌ చేస్తాయని తెలిపారు. సాధారణ ఎస్సెమ్మెస్‌/ఎంఎంఎస్‌ టెక్ట్సింగ్‌కు అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ అయిన ఈ ఆర్‌సీఎస్‌లో వాట్సప్‌ తరహా సదుపాయాలు ఉంటాయి. ఇప్పటివరకు కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లకే పరిమితమైన కాల్‌ రికార్డింగ్‌ ఫీచర్‌ని ఐఫోన్లలోనూ తీసుకొచ్చింది. దీంతో ఇకపై కాల్స్‌ని రికార్డ్‌ చేసుకోవచ్చు. వీటితోపాటు యాప్‌ లాక్‌, యాప్‌ హైడ్‌, గేమ్‌ మోడ్‌ వంటి ఫీచర్లను జోడించింది. ఐప్యాడ్‌లో క్యాలిక్యులేటర్‌ సదుపాయం తీసుకొచ్చింది.

ఆధార్‌ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్‌ అవసరం లేదు: ఈపీఎఫ్‌వో

ఏఐ రేసులో దూసుకెళ్లేందుకు యాపిల్‌ తన వాయిస్‌ అసిస్టెంట్‌ సిరికి ఏఐ సాంకేతికతను తీసుకురానుంది. ముందుగా ఐఓఎస్‌ 18 (iOS 18), ఐప్యాడ్‌ఓఎస్‌ 18 (iPadOS 18), మ్యాక్‌ ఓఎస్‌ Sequoiaలో మొదటగా చాట్‌జీపీటీ సేవలు ప్రారంభం కానున్నాయి. అకౌంట్‌ క్రియేట్‌ చేయకుండానే యాక్సెస్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే తన ఐఫోన్లలో చాట్‌జీపీటీ వినియోగించాలా? వద్దా? అనే ఎంపిక యూజర్లదే అని యాపిల్‌ తెలిపింది. యాపిల్‌ భాగస్వామ్యంతో యాపిల్‌ పరికరాల్లో చాట్‌జీపీటీ సదుపాయం తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ఆల్ట్‌మన్‌ (Sam Altman) అన్నారు. డేటా భద్రతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని