Apple: భారత్‌లో రెండో యాపిల్‌ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌ కుక్‌

Apple: స్టోర్ల ప్రారంభం నిమిత్తం ఏప్రిల్‌ 17నే భారత్‌కు చేరుకున్న టిమ్‌ కుక్‌ మంగళవారం యాపిల్‌ బీకేసీని ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. నేడు దిల్లీలో రెండో స్టోర్‌ను తెరిచి వినియోగదారులకు స్వాగతం పలికారు.

Published : 20 Apr 2023 11:27 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) భారత్‌లో రెండో అధీకృత విక్రయశాలను గురువారం ప్రారంభించింది. సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook), సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేడ్రే బ్రియాన్‌తో కలిసి వినియోగదార్లకు స్వాగతం తెలిపారు. కుక్‌తో సెల్ఫీలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు కస్టమర్లు పోటీ పడ్డారు. ముంబయిలోని జియో వరల్డ్‌ డ్రైవ్‌ మాల్‌లో యాపిల్‌ బీకేసీ (Apple BKC) పేరిట తొలి స్టోర్‌ను ఏప్రిల్‌ 18న ప్రారంభించిన విషయం తెలిసిందే.

దిల్లీ స్టోర్‌ను యాపిల్‌ సాకేత్‌ (Apple Saket)గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ‘సెలెక్ట్‌ సిటీవాక్‌’ మాల్‌లో ఏర్పాటు చేశారు. యాపిల్‌ బీకేసీ (Apple BKC)తో పోలిస్తే దిల్లీలోని స్టోర్‌ విస్తీర్ణంలో సగం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ సాకేత్‌లో 70 మంది నిపుణులైన యాపిల్‌ ప్రతినిధులు కస్టమర్లకు సేవలు అందించనున్నారు. వీరు 18 రాష్ట్రాలకు చెందినవారు. అందరూ కలిసి మొత్తం 15 భాషల్లో మాట్లాడగలరు. 

స్టోర్ల ప్రారంభం నిమిత్తం ఏప్రిల్‌ 17నే భారత్‌కు చేరుకున్న టిమ్‌ కుక్‌ (Tim Cook) మంగళవారం యాపిల్‌ బీకేసీని ప్రారంభించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణి అయిన భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కుక్‌ తెలిపారు. దేశంలోని తమ కాంట్రాక్టు తయారీదార్ల వద్ద ఉద్యోగుల సంఖ్యను పెంచి 2 లక్షలకు చేర్చాలని యాపిల్‌ నిర్ణయించినట్లు సమాచారం. తమ విడిభాగాల తయారీ సంస్థలను భారత్‌లో విస్తరించేందుకు ప్రభుత్వ మద్దతును టిమ్‌ కుక్‌  కోరినట్లు సమాచారం.

గత 15 ఏళ్లలో తమ వ్యాపారానికి చైనా ఎంత సహాయపడిందో.. అదే తరహాలో భారత్‌ మార్కెట్‌ తమకు కలిసి వస్తుందని యాపిల్‌ భావిస్తోంది. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నందన, ఇక్కడి అవసరాలు తీర్చడంతో పాటు ఎగుమతులకూ తయారీ కేంద్రంగా భారత్‌ను మార్చుకోవాలని అనుకుంటోంది. మార్చి 31తో ముగిసిన ఏడాదికి 6 బిలియన్‌ డాలర్ల విక్రయాలతో కంపెనీ కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని