Apple: భారత్‌ నుంచి యాపిల్‌కు రికార్డు స్థాయిలో ఆదాయం.. త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

Eenadu icon
By Business News Team Published : 01 Nov 2024 12:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Apple | ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో యాపిల్‌ ఐఫోన్ల (iPhone) విక్రయాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐఫోన్‌ విక్రయాల ద్వారా యాపిల్‌కు భారత్‌ నుంచి వస్తోన్న ఆదాయం ఆల్‌ టైమ్‌ గరిష్ఠాలకు చేరింది. ఐప్యాడ్‌ విక్రయాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని యాపిల్‌ సీనియర్‌ అధికారులు తెలిపారు. దీంతో కంపెనీ మొత్తం నికర అమ్మకాల్లో 6 శాతం వృద్ధి నమోదై 94.93 బిలియన్‌ డాలర్లకు (7.98లక్షల కోట్లు) చేరిందని యాపిల్‌ తెలిపింది. గతేడాది ఇదే సమయంలో నికర అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం 89.49 బిలియన్‌ డాలర్లుగా (7.524 లక్షల కోట్లు) ఉంది.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్‌ తాజాగా ప్రకటించింది. ‘‘అమెరికా, యూరప్‌, ఆసియా పసిఫిక్‌తో పాటు యూఎస్‌, బ్రెజిల్‌, మెక్సికో, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, కొరియా, మలేషియా, థాయ్‌లాండ్‌తో సహా పలు దేశాల్లో సెప్టెంబర్‌ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఆదాయాలు ఆర్జించాం. భారత్‌ నుంచి వచ్చే ఆదాయంలో సరికొత్త రికార్డును నెలకొల్పాం’’ అని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించారు.  ప్రస్తుత త్రైమాసికంలో రెండు స్టోర్‌లను ప్రారంభించిందని తెలిపిన ఆయన త్వరలోనే మరో నాలుగు కొత్త స్టోర్‌లను తీసుకురానున్నట్లు ప్రకటించారు.

నేడే మూరత్‌ ట్రేడింగ్‌.. టైమింగ్స్‌, ఏ స్టాక్స్‌ కొనుగోలు చేయాలి?

కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్‌లో సెప్టెంబర్‌ త్రైమాసికంలో యాపిల్‌ ఐఫోన్‌ విక్రయాల ద్వారా వచ్చే విలువ పరంగా మార్కెట్‌ వాటాలో 21.6శాతంగా ఉన్నాయి. అంటే శాంసంగ్‌ కంటే కాస్త వెనకబడి ఉంది. యాపిల్‌ మొత్తం ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో 4.12శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో ఐఫోన్‌ అమ్మకాలు 5.5శాతం పెరగ్గా, ఐప్యాడ్‌ అమ్మకాలు 8శాతం పెరిగాయి. ఇక వార్షికంగా చూస్తే ఉత్పత్తి విక్రయాల విలువ 2శాతం పడిపోయింది. 189.28 బిలియన్‌ డాలర్ల నుంచి 185.23 బిలియన్‌ డాలర్లకు చేరింది. అనేక ప్రాంతాల్లో యాపిల్‌ అమ్మకాల్లో వృద్ధి నమోదైనప్పటికీ, చైనాలో మాత్రం విక్రయాలు మందగించాయి. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే విక్రయాలు 8శాతం తగ్గుముఖం పట్టాయి. ఐప్యాడ్‌ విక్రయాలు 6శాతం పడిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని