RBI Deputy Governor: ఏఆర్‌సీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయ్‌

ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఏఆర్‌సీ)లు నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ తెలిపారు.

Updated : 30 May 2024 03:33 IST

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌
ఎడెల్‌వీజ్‌ రుణ, ఏఆర్‌సీ సంస్థలపై ఆంక్షలు 

ముంబయి: ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ (ఏఆర్‌సీ)లు నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ స్వామినాథన్‌ తెలిపారు. ఆర్‌బీఐ జోక్యం చేసుకోకముందే అవి తమ విధానాలు సరిచేసుకుంటే మేలని హెచ్చరించారు. దేశంలోని అగ్రగామి ఏఆర్‌సీల యాజమాన్యాలతో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఏఆర్‌సీలు నిబంధనలను పాటించడంతో పాటు నియంత్రణ వ్యవస్థ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. చాలా సందర్భాల్లో మా పరిశీలనలకు స్పందనగా, తప్పుడు/తెలివైన సమాధానాలు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు. మేం జోక్యం చేసుకోకముందే ఏఆర్‌సీల బోర్డులు నిబంధనల విషయంలో సరిగ్గా నడుచుకుంటే మంచిద’ని స్వామినాథన్‌ సూచించారు. ‘వ్యవస్థలో ఒత్తిడిలో ఉన్న రుణ ఆస్తులకు పరిష్కారం చూపే సత్తా ఏఆర్‌సీలకు ఉంది. కాబట్టి అవి నైతికతకు విలువ ఇస్తూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. కొన్ని ఏఆర్‌సీలు వాటికిచ్చిన ప్రత్యేక హోదా నుంచి పూర్తి ప్రయోజనాలను పొందుతున్నాయి. కొన్ని వినూత్న పద్ధతుల ద్వారా, నిబంధనలను మీరి లావాదేవీలు సాగిస్తున్నాయి. చాలా సందర్భాల్లో సెక్యూరిటీ రిసీట్ల విలువ, జారీలో పారదర్శకత లోపిస్తోంద’ని ఆయన అన్నారు. 

సీజ్‌ అండ్‌ డిసిస్ట్‌ ఆదేశాలు: ఎడెల్‌వైజ్‌కు చెందిన రుణ, ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలపై ఆర్‌బీఐ వ్యాపార ఆంక్షలను విధించింది. ఈ సంస్థలు అప్పటికే రుణాలు తీసుకున్నవారికి, కొత్త రుణాలు ఇవ్వడంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి నిర్మాణాత్మక లావాదేవీలు చేపట్టరాదంటూ ఈసీఎల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌పై ‘సీజ్‌ అండ్‌ డిసిస్ట్‌’ ఆదేశాలను జారీ చేసింది. చెల్లింపులు/ఖాతా మూసివేతలకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తించవని తెలిపింది. ఎడెల్‌వైజ్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఈఏఆర్‌సీఎల్‌)  ఎటువంటి ఆర్థిక ఆస్తులు కొనుగోలు చేయకుండా ‘సీజ్‌ అండ్‌ డిసిస్ట్‌’ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని