Telecom: మొబైల్‌ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం

Telecom: అమెరికాలో గతవారం టెలికాం సేవల్లో తలెత్తిన అంతరాయానికి పరిహారంగా ఏటీ అండ్‌ టీ సంస్థ తమ కస్టమర్లకు ఒక్కొక్కరికి ఐదు డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది.

Updated : 26 Feb 2024 10:42 IST

డల్లాస్: అమెరికాలో గతవారం పలు ప్రాంతాల్లో టెలికాం సేవల్లో అంతరాయం (Cellphone network outage) ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రభావితమైన తమ కస్టమర్లకు ఒక్కొక్కరికి ఐదు డాలర్లు పరిహారంగా చెల్లిస్తామని ఏటీ అండ్‌ టీ కంపెనీ ఆదివారం ప్రకటించింది. వచ్చే రెండు బిల్లింగ్‌ సైకిళ్లలో ఈ మొత్తాన్ని ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. ప్రీపెయిడ్‌ యూజర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే వారికి పరిహారం విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అవి ఏమిటో మాత్రం వెల్లడించలేదు.

ఏటీ అండ్‌ టీ, వెరిజోన్‌, టి-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో (Mobile Networks) కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ గతవారం వెల్లడించిన విషయం తెలిసిందే. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ సహా పలు ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నారు. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో ఈ పరిస్థితి తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని