LPG Price: తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర.. ₹లక్ష దిగువకు విమాన ఇంధనం

Fuel Prices: వాణిజ్య వంటగ్యాస్‌ సిలిండర్‌, విమాన ఇంధన ధరలు కాస్త దిగొచ్చాయి.

Published : 01 Jun 2024 12:40 IST

దిల్లీ: హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్‌ (Commercial LPG Cylinder) ధర తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త దిగిరావడంతో 19 కిలోల సిలిండర్‌పై చమురు విక్రయ సంస్థలు రూ.69 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో దీని ధర రూ. 1676కు చేరింది. హైదరాబాద్‌లో ఈ ధర రూ.1925.5గా ఉంది.

వాణిజ్య సిలిండర్‌ ధర (Cylinder Price)ను తగ్గించడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. అంతకుముందు ఏప్రిల్‌ 1న రూ.30.5, మే ఒకటో తేదీన రూ.19 మేర తగ్గించారు. మరోవైపు, గృహ వినియోగ సిలిండర్‌ ధరలో మాత్రం ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. 14.2 కిలోల సిలిండర్‌ ధర దిల్లీలో రూ.803, హైదరాబాద్‌లో రూ.855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలనూ సవరించలేదు.

క్విక్‌ కామర్స్‌లోకి జియోమార్ట్‌!

6.5శాతం తగ్గిన విమాన ఇంధన ధర

అటు ఏవియేషన్ టర్బైన్‌ ఫ్యుయల్‌ (ATF) ధరలను కూడా చమురు సంస్థలు 6.5శాతం తగ్గించాయి. దీంతో దేశ రాజధానిలో కిలో లీటరు (ఒక కిలో లీటర్‌ అంటే 1000 లీటర్లు) విమాన ఇంధన ధర (Jet fuel) రూ.6,673.87 తగ్గి రూ.94,969.01కి దిగొచ్చింది. మే 1న దీని ధరను స్వల్పంగా రూ.749.25 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దేశీయంగానూ కంపెనీలు ప్రతినెలా పలు ఇంధన ధరలను సవరిస్తుంటాయి. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రాల్లో వీటి ధరలు వేర్వేరుగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని