ATF-Cylinder: విమాన ఇంధనం.. వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గాయ్‌..!

ధరల మోతతో అల్లాడిపోతోన్న దేశ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. విమాన ఇంధన ధర 4.5శాతం, వాణిజ్య సిలిండర్ ధర రూ.25 మేర తగ్గాయి.

Updated : 01 Oct 2022 11:16 IST

దిల్లీ: ధరల మోతతో అల్లాడిపోతోన్న దేశ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే వార్త. విమాన ఇంధనం, వాణిజ్య సిలిండర్‌ ధరలు కాస్త తగ్గాయి. ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ (ఏటీఎఫ్‌) ధరను 4.5శాతం తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హోటళ్లు, రెస్టారంట్లలో ఉపయోగించే 19కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర కూడా రూ.25.5 మేర దిగొచ్చింది. ఈ తగ్గింపు అక్టోబరు 1వ తేదీ నుంచే అమల్లోకి రానుంది.

తాజా తగ్గింపుతో దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య సిలిండర్‌ ధర రూ.1859.50కి తగ్గింది. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో దేశీయంగా వీటి ధరలు కాస్త తగ్గుతున్నాయి. కమర్షియల్‌ సిలిండర్‌ ధరను తగ్గించడం గత జూన్‌ నుంచి ఇది ఆరోసారి. మొత్తంగా రూ.494.50 తగ్గించారు. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్‌పై చమురు సంస్థలు నేడు ఎలాంటి మార్పు చేయలేదు. 14.2 కేజీల ఈ సిలిండర్‌ ధర ప్రస్తుతం దిల్లీలో రూ.1053గా ఉంది. ఇక ఏటీఎఫ్‌ ధరపై రూ.5,527.17 (4.5శాతం) తగ్గించారు. దీంతో దిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,15,520.27గా ఉంది.

దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరను చమురు సంస్థలు ప్రతి నెలకోసారి సవరిస్తుంటాయి. అదే ఏటీఎఫ్‌ అయితే ప్రతి 15 రోజులకోసారి మార్పులు చేస్తుంటాయి. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ఈ రేట్లను సవరిస్తారు. కాగా.. గత ఆరు నెలలుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని