Electric Vehicles: ఈవీలతో సిద్ధమవుతున్న వాహన తయారీ సంస్థలు

Electric Vehicles: విద్యుత్తు వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వం నుంచీ ప్రోత్సాహం లభిస్తోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ సంస్థలు వచ్చే కొన్నేళ్లలో ఈవీల విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Published : 24 Mar 2024 13:51 IST

Electric Vehicles | దిల్లీ: దేశీయ వాహన తయారీ సంస్థలు వివిధ రకాల విద్యుత్తు వాహనాలను (Electric Vehicles) మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. స్వచ్ఛ ఇంధన వాహనాలకు ప్రభుత్వం నుంచీ దన్ను లభిస్తోంది. ఇటీవలే కేంద్రం ఇ-మొబిలిటీ ప్రమోషన్‌ స్కీమ్‌ 2024ను తీసుకొచ్చింది. 2024 ఏప్రిల్‌ నుంచి 4 నెలల కోసం రూ.500 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో డిమాండ్‌కు అనుగుణంగా మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ వంటి సంస్థలు కొత్త మోడళ్లను సిద్ధం చేస్తున్నాయి.

మహీంద్రా నుంచి ఐదు..

2025 జనవరి నుంచి వచ్చే కొన్నేళ్లలో ఐదు కొత్త విద్యుత్తు వాహనాలను విడుదల చేయనున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra and Mahindra) సీఈఓ నలినీకాంత్‌ గొల్లగుంట తెలిపారు. ఈ ఎస్‌యూవీలను మహీంద్రా INGLO ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈవీ రంగంలో అగ్రస్థానంలో ఉండాలనే దీర్ఘకాల లక్ష్యంలో భాగంగానే వీటిని తీసుకొస్తున్నామన్నారు. 2027 నాటికి తమ పోర్ట్‌ఫోలియోలో 20-30 శాతం విద్యుత్తు వాహనాలే ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.

ఎనిమిదేళ్లలో ఆరు మారుతీ ఈవీలు..

ఈవీల్లో మారుతీ సుజుకీ (Maruti Suzuki) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (కార్పొరేట్‌ వ్యవహారాలు) రాహుల్‌ భారతీ వెల్లడించారు. 2024-25లో 550 కిలోమీటర్ల రేంజ్‌తో ఓ కారును విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలా వచ్చే 7-8 ఏళ్లలో ఆరు రకాల ఈవీలను తీసుకొస్తామని చెప్పారు. అయితే, కర్బన రహిత రవాణా కోసం కేవలం ఈవీలే కాకుండా హైబ్రిడ్‌-ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ, బయో-సీఎన్‌జీ, ఇథనాల్‌ ఫ్లెక్స్‌ ఫ్యుయెల్‌.. వంటి సాంకేతికతలతోనూ వాహనాలు రావాల్సి ఉందన్నారు. వాటన్నింటిపై మారుతీ సుజుకీ పనిచేస్తోందని తెలిపారు.

ఈవీల్లో హ్యుందాయ్‌ భారీ పెట్టుబడులు..

తమ కంపెనీ వచ్చే పదేళ్లలో తమిళనాడులో రూ.26,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని హ్యుందాయ్‌ (Hyundai) వెల్లడించింది. అందులో భాగంగానే ఓ బ్యాటరీ తయారీ సంస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు నేపథ్యంలో దేశీయ రవాణాలో త్వరలో ఈవీల వాటా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హ్యుందాయ్‌ ఇప్పటికే దేశంలో కోనా, అయోనిక్‌-5 ఈవీలను విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.

2026కు 10 హ్యుందాయ్‌ ఈవీలు..

2026 నాటికి భారత్‌లో 10 విద్యుత్తు వాహనాలను విడుదల చేస్తామని టాటా మోటార్స్‌ (TATA Motors) అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఏడాది కర్వ్‌, హ్యారియర్‌ సహా నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

లగ్జరీ కార్లలోనూ..

లగ్జరీ కార్ల సంస్థలు సైతం ఈవీలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌ 2024లో 12 కార్ల మోడల్స్‌ను విడుదల చేయనుంది. వీటిలో మూడు ఈవీలేనని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఆడీ ఇండియా ఇప్పటికే దేశంలో నాలుగు రకాల ఈవీలను విక్రయిస్తోంది. 2030 నాటికి తమ విక్రయాల్లో 50 శాతం విద్యుత్తు వాహనాల వాటా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని