SEBI: 6 నెలల సగటే.. ఇకపై మార్కెట్‌ విలువ

నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్‌ విలువ లెక్కింపునకు ఒక్క రోజుకు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది.

Updated : 22 May 2024 02:22 IST

2024 డిసెంబరు 31 నుంచి అమలు: సెబీ

దిల్లీ: నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్‌ విలువ లెక్కింపునకు ఒక్క రోజుకు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు నమోదు, వెల్లడి నిబంధనల్లో (ఎల్‌ఓడీఆర్‌) సెబీ సవరణ చేయనుంది. ఈ సవరణ 2024 డిసెంబరు 31 నుంచి అమల్లోకి వస్తుంది. జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు సగటు మార్కెట్‌ విలువ ఆధారంగా, నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువను, ర్యాంకులను నిర్ణయిస్తారు. ఇందుకు డిసెంబరు 31ను కట్‌-ఆఫ్‌ డేట్‌గా తీసుకుంటారు. డిసెంబరు 31న మార్కెట్‌ విలువను నిర్థరించిన తర్వాత..సంబంధిత నిబంధనలు అమలయ్యేందుకు 3 నెలలు లేదా తదుపరి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఏది తర్వాత అయితే అప్పటి వరకు పరివర్తనా కాలంగా (ట్రాన్షిషన్‌ పీరియడ్‌) ఉంటుంది. ‘ఏడాది చివరి రోజు అంటే డిసెంబరు 31న స్టాక్‌ ఎక్స్ఛేంజీలు జులై 1 నుంచి డిసెంబరు 31 వరకు నమోదిత కంపెనీల సగటు మార్కెట్‌ విలువ ఆధారంగా, ఆ కంపెనీల ర్యాంకులతో జాబితాను సిద్ధం చేయాల’ని సెబీ తెలిపింది. 

  •  సందర్భం ఏదైనా గానీ బోర్డు సమావేశాల నిర్వహణకు రెండు పనిదినాలు ముందుగా సమాచారం ఇవ్వాలని సెబీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక ఫలితాలు, షేర్ల బైబ్యాక్, నిధుల సమీకరణ లాంటి కొన్ని ప్రత్యేక అంశాల అజెండాపై బోర్డు సమావేశాల నిర్వహణకు 2-11 రోజుల్లోగా ముందస్తు సమాచారం ఇచ్చే వీలుంది. ఇప్పుడు ఈ కాలపరిమితిని 2 రోజులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
  •  పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నద్ధతలో ఉన్న కంపెనీలు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణంలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇష్యూ పరిమాణాన్ని రూపాయల్లో లేదా షేర్ల సంఖ్య ఆధారంగా మళ్లీ కొత్తగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సెబీ తెలిపింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు