GST: ఈ ఏడాది సగటు జీఎస్‌టీ వసూళ్లు రూ.1.66 లక్షల కోట్లు

GST: ఈ ఏడాదిలో ప్రతినెలా జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు దాటినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Published : 04 Dec 2023 18:41 IST

దిల్లీ: జీఎస్‌టీ వసూళ్లలో (GST Collections) ఏటా గణనీయ వృద్ధి నమోదవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు నెలకు సగటున రూ.1.66 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాదిలో ప్రతినెలా వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లు దాటినట్లు తెలిపారు. 2023 ఏప్రిల్‌లో జీఎస్‌టీ నుంచి రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

2022- 2023లో సగటు నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు (GST Collections) రూ.1.50 లక్షల కోట్లుగా ఉన్నట్లు సీతారామన్‌ తెలిపారు. 2021-22లో రూ.1.23 లక్షల కోట్లు, 2020- 21లో రూ.94,734 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 30 శాతం, 22 శాతం వృద్ధి నమోదైనట్లు మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరీ తెలిపారు. జీఎస్‌టీ మండలి సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోందన్నారు. దీని వల్ల ఎగవేతలు తగ్గి వసూళ్లు పెరుగుతున్నాయని తెలిపారు. 

మరోవైపు భారత్‌ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని పంకజ్‌ చౌదరీ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను సైతం సాధిస్తామని తెలిపారు. స్థూల ఆర్థిక స్థిరత్వం ద్వారా రూపాయి బలపడుతుందని పేర్కొన్నారు. 2010-11లో భారత జీడీపీ 1.71 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న విషయం తెలిసిందే. 2020-21 నాటికి 2.67 లక్షల కోట్ల డాలర్లు, 2022- 23లో 3.7 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. 2027- 28 నాటికి భారత్‌ ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇటీవల ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ సంస్థ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని