Digital Payments: చెల్లింపుల్లో వైఫల్యానికి బ్యాంకులదే లోపం

డిజిటల్‌ చెల్లింపుల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు బ్యాంకులే కారణమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు.

Updated : 08 Jun 2024 02:15 IST

ముంబయి: డిజిటల్‌ చెల్లింపుల సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు బ్యాంకులే కారణమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. దీనికి యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వ్యవస్థలకు ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ‘యూపీఐ చెల్లింపుల్లో అంతరాయాలకు కారణాలను విశ్లేషించడానికి ప్రతి ఒక్క సంఘటననూ ఆర్‌బీఐ అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో యూపీఐ, ఎన్‌పీసీఐ వ్యవస్థల్లో ఎలాంటి సమస్యలూ కనిపించలేదు. సమస్య బ్యాంకు వైపు నుంచే వస్తోంది. దీనిపై మేమూ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. అంతరాయాలపై పరిశోధిస్తున్నప్పుడు ఆర్‌బీఐ బృందాలు ఎన్‌పీసీఐ వ్యవస్థనూ తనిఖీ చేస్తాయని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు తమ డిజిటల్‌ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిస్టమ్‌ డౌన్‌లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలనే విషయంలో ఆర్‌బీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోందని, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో బయటపడిన లోపాల్లాంటివి గుర్తిస్తే, బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నామని వివరించారు. సాంకేతిక వ్యవస్థల పటిష్ఠత కోసం బ్యాంకులు తగిన స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయని, వ్యాపార వృద్ధికి అనుగుణంగా ఐటీ వ్యవస్థల్లో వేగం పెంచేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాంకేతికతపై ఎంత ఖర్చు చేసేదీ బ్యాంకుల ఇష్టమని, అదే సమయంలో విపత్తు వచ్చినప్పుడు రికవరీ వ్యవస్థలను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని బ్యాంకులకు సూచించారు. 

వడ్డీ రేట్ల విషయంలో పారదర్శకత ఉండాలి: యూపీఐ లైట్‌ ద్వారా నెలకు కోటికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయని, ఇవి పెరిగే కొద్దీ బ్యాంకు సర్వర్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి.రబి శంకర్‌ తెలిపారు. కొన్ని సంస్థలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయనే ప్రశ్నకు మరో డిప్యూటీ గవర్నర్‌ జెస్వామినాథన్‌ స్పందిస్తూ.. వడ్డీ వసూలు విషయంలో పారదర్శకత పాటించాలని, సహేతుకంగా ఉండాలని తమ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు అధిక వడ్డీలను విధిస్తున్నాయని.. అందువల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉందని చెప్పలేమన్నారు. కొన్ని బ్యాంకులు కీలక ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లు ఇవ్వడం లేదని, వీటిపై నియంత్రణ సంస్థ తనిఖీలు చేస్తోందని ఆర్‌బీఐ గవర్నర్‌ దాస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు