March 31 Deadline: బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్‌!

March 31 Deadline: ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

Updated : 29 Mar 2024 15:45 IST

దిల్లీ: ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. దీంతో చాలామంది పన్ను సహా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను పూర్తి చేసేందుకు పోటీపడుతుంటారు. కానీ, 28న గుడ్‌ఫ్రైడే, 31 ఆదివారం కావటంతో బ్యాంకులు, బీమా సంస్థలు, పన్ను సంబంధిత కార్యాలయాలకు సెలవులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ (RBI), ఐఆర్‌డీఏఐ, ఆదాయ పన్ను విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

ఏజెన్సీ బ్యాంకులన్నీ..

ప్రభుత్వ వ్యాపార లావాదేవీలను నిర్వహించే శాఖలను ఈనెల 30, 31న తెరిచి ఉంచాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ లావాదేవీలు జరిగినట్లుగా వివరాలు లెక్కలోకి రావాలన్నదే దీనివెనక ఉద్దేశమని ఆర్‌బీఐ తెలిపింది. ఈనేపథ్యంలో మార్చి 30, 31న శాఖలను తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులను ఆదేశించింది. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌, చెక్‌ క్లియరింగ్‌ కార్యకలాపాలు ఆ రెండు రోజుల్లో యథావిధిగా కొనసాగుతాయని బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్, పీపీఎఫ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల్లో డిపాజిట్ల స్వీకరణ ఉంటుందని చెప్పాయి.

సాధారణ బ్యాంకింగ్‌ సేవలు?

సాధారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మార్చి 31 డెడ్‌లైన్‌తో ముడిపడి ఉన్న కార్యకలాపాలను మాత్రమే అనుమతిస్తారా? లేదా సాధారణ బ్యాంకింగ్‌ సేవలన్నీ అందిస్తారా తెలియాల్సి ఉంది. ఆర్‌బీఐ పరిధిలో ప్రధాన బ్యాంకులతో కలిపి మొత్తం 33 ఏజెన్సీ బ్యాంకులున్నాయి. డీబీఎస్‌ ఈ జాబితాలో ఉన్నప్పటికీ.. 31న తమ శాఖలు మూసి ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఏయే బ్రాంచీలు ఆరోజు తెరిచి ఉంటాయి.. ఏ సేవలు అందుతాయో ముందే తెలుసుకుంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎల్‌ఐసీ ఓపెన్‌..

ఆర్‌బీఐ తరహాలోనే ఐఆర్‌డీఏఐ సైతం బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్చి 30, 31న కార్యాలయాలు తెరిచి ఉంచాలని ఆదేశించింది. ప్రత్యేక ఏర్పాట్లు చేసి కస్టమర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. ఈనేపథ్యంలో శని, ఆదివారాల్లో తమ ఆఫీసులన్నీ పనిచేస్తాయని ఎల్‌ఐసీ (LIC) తెలిపింది.

పన్ను విభాగాలు..

పన్ను సంబంధిత కార్యకలాపాలను పూర్తి చేసేందుకు మార్చి 29, 30, 31న దేశవ్యాప్తంగా తమ శాఖలన్నీ పనిచేస్తాయని ఆదాయ పన్ను విభాగం మార్చి 18న ప్రకటన విడుదల చేసింది.

రూ.2000 నోట్ల మార్పిడికి నో..

2024 ఏప్రిల్‌ 1న (సోమవారం) రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌ సేవలు తమ ఆఫీసుల్లో అందుబాటులో ఉండబోవని ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖాతాల ముగింపు కార్యకలాపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 2 నుంచి సేవలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని