Bharti Hexacom IPO: భారతీ హెగ్జాకామ్‌ ఐపీఓ ధరల శ్రేణి రూ.542-570

Bharti Hexacom IPO: భారతీ హెగ్జాకామ్‌ ఐపీఓ ఏప్రిల్‌ 3న ప్రారంభమై 5న ముగియనుంది. మదుపర్లు కనీసం రూ.14,820తో 26 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.

Updated : 26 Mar 2024 12:11 IST

దిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ ‘భారతీ హెగ్జాకామ్‌’ ఐపీఓ (Bharti Hexacom IPO) ధరల శ్రేణిని రూ.542-570గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.4,275 కోట్లు సమీకరించనుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 3న ప్రారంభమై 5న ముగియనున్న విషయం తెలిసిందే. యాంకర్‌ మదుపర్లు ఏప్రిల్‌ 2న బిడ్లు దాఖలు చేసుకోవచ్చు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీ హెగ్జాకామ్‌ ఐపీఓనే (IPO) మొదటిది. ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద జరగనుంది. దీంతో ఐపీఓ ద్వారా సమీకరించే నిధులేమీ కంపెనీకి చెందబోవు. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా 7.5 కోట్ల షేర్లను వాటాదారు ‘టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా’ (టీసీఐఎల్‌) విక్రయించనుంది. ఈ సంస్థలో 70 శాతం వాటా భారతీ ఎయిర్‌టెల్‌కు, 30 శాతం టీసీఐఎల్‌కు ఉన్నాయి.

ఐపీఓలో 75 శాతం షేర్లను అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు, 10 శాతం రిటైల్‌లో కేటాయించారు. ఇన్వెస్టర్లు కనీసం రూ.14,820తో 26 షేర్లకు (ఒక లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.6,719.20 కోట్లుగా, పన్నేతర లాభం రూ.549 కోట్లుగా నమోదైంది.

రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల టెలికాం సర్కిళ్లలో భారతీ హెగ్జాకామ్‌ మొబైల్‌, ఫిక్స్‌డ్‌ లైన్‌ టెలిఫోన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తోంది. ఐపీఓ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, బీఓబీ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. ఐపీఓ అనంతరం కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో నమోదు కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని