McDonalds: మెక్‌డొనాల్డ్స్‌లో అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌.. ఈ గోల్డ్‌ కార్డ్‌ గురించి తెలుసా?

మెక్‌డొనాల్ట్స్‌లో అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ తినాలనుకునేవారికి ఆ సంస్థ అందించే గోల్డ్‌ కార్డ్‌ గురించి తెలుసా? అసలు గోల్డ్‌ కార్డ్ అంటే ఏమిటి.. దానితో లాభాలేంటి?

Updated : 05 Jun 2024 19:41 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: మెక్‌డొనాల్డ్స్‌ (McDonalds)లో రకరకాల ఆహార పదార్థాలు తినాలనే ఆశ అందరికీ ఉంటుంది. కొన్ని రెస్టారంట్లలోలా మెక్‌డొనాల్డ్స్‌లో కూడా అన్ లిమిటెడ్ ఆహారం అందిస్తే బాగుంటుందని చాలా మంది ఫుడ్డీస్‌ అనుకుంటుంటారు. అలాంటి ఒక అవకాశం ఉందని దానికోసం ‘గోల్డ్‌ కార్డ్‌’ (Gold Card) ఉంటుందని మీకు తెలుసా? బిల్ గేట్స్(Bill Gates), వారెన్ బఫెట్ (Warren Buffett) వంటి బిలియనీర్ల వద్ద ఈ కార్డు ఉంది. ఈ విషయాన్ని వారెన్ బఫెట్ స్వయంగా వెల్లడించారు. గతంలో ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఆయన ‘గోల్డ్ కార్డ్’ చూపిస్తూ తనకు మెక్‌డొనాల్డ్ గోల్డ్‌ కార్డ్‌ ఉందని, దీనిద్వారా తాను, తన కుటుంబసభ్యులు జీవితాంతం వారి నగరంలోని ఏదైనా మెక్‌డొనాల్డ్స్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ తినడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన స్నేహితుడు, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు కూడా ఈ కార్డు ఉందని, అయితే గేట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మెక్‌డొనాల్డ్స్‌లో అయినా దానిని ఉపయోగించుకునే అవకాశం ఉందని వారెన్ బఫెట్ చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గోల్డ్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు, దానిని ఎలా పొందాలనే విషయాలను మెక్‌డొనాల్డ్స్‌ ఎప్పుడూ బహిరంగంగా తెలపలేదు. ఇది కేవలం బిలియనీర్లకు మాత్రమే ఇచ్చే ప్రత్యేక ఆఫర్‌ అయ్యుండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం దీనిపై మెక్‌డొనాల్డ్స్‌ స్పందించింది. ప్రముఖులు, కోటీశ్వరులతో పాటు సామాన్యులకు కూడా ఈ అవకాశం ఇస్తామని పేర్కొంది. దీనికోసం కంపెనీ నిర్వహించే “SZN ఆఫ్ షేరింగ్” పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని వివరించింది. ప్రజలు మెక్‌డొనాల్డ్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేసి ఈ పోటీలో పాల్గోవచ్చని తెలిపింది. ఇందులో గెలుపొందిన వారికి గోల్డ్ కార్డ్ అందజేస్తామంది. దీనిద్వారా కార్డ్‌ హోల్డర్లు 50 సంవత్సరాల పాటు వారానికి రెండుసార్లు తమ నగరాలలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఉచితంగా అన్‌లిమిటెడ్‌ ఫుడ్‌ తినొచ్చు. కార్డు హోల్డర్‌తో పాటు మరో ముగ్గురికి కూడా ఈ అవకాశం ఉంటుందని కంపెనీ యాజమాన్యం వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని