Bitcoin: 40,000 డాలర్ల మార్క్‌ దాటిన బిట్‌కాయిన్‌

Bitcoin: గత 24 గంటల వ్యవధిలో బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Updated : 04 Dec 2023 11:34 IST

Bitcoin | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ మరోసారి 40 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు ఇకపై ఉండకపోవచ్చుననే సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా దిగొచ్చిన నేపథ్యంలో రేట్ల కోత వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవ్వొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే బిట్‌కాయిన్‌ (Bitcoin) ర్యాలీకి దోహదం చేస్తోంది.

భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం 10:37 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ నాలుగు శాతం పెరిగి 40,950 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడు రోజుల్లో ఈ కాయిన్‌ (Bitcoin) దాదాపు 10 శాతం పెరగడం గమనార్హం. మరో కీలక కాయిన్‌ అయిన ఇథేరియం గత 24 గంటల్లో 3.3 శాతం, 7 రోజుల్లో 8.5 శాతం పుంజుకుంది. 2023లో ఇప్పటి వరకు బిట్‌కాయిన్‌ (Bitcoin) 146 శాతం పుంజుకుంది. చివరిసారి 2022 ఏప్రిల్‌లో 40 వేల డాలర్ల మార్క్‌ వద్ద ట్రేడైంది. ఆ సమయంలో టెర్రాయూఎస్‌డీ స్టేబుల్‌ కాయిన్ పతనంతో క్రిప్టో మార్కెట్‌లో రెండు లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైన విషయం తెలిసిందే.

మరోవైపు బ్లాక్‌రాక్‌ కంపెనీ తొలి అమెరికా స్పాట్‌ బిట్‌కాయిన్‌ (Bitcoin) ఈటీఎఫ్‌ను ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి జనవరిలో అనుమతి లభించే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది కూడా క్రిప్టో కరెన్సీ పుంజుకోవడానికి దోహదం చేస్తోంది. దివాలా తీసిన క్రిప్టోఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ దోషిగా తేలిన విషయం తెలిసిందే. మరోవైపు బైనాన్స్‌ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్‌ ఝావో అనేక ఆరోపణలతో క్రిప్టో పరిశ్రమ నుంచి వైదొలగారు. ఈ రెండు పరిణామాలు.. 2022 నాటి పతనం నుంచి కోలుకోవడానికి క్రిప్టో కరెన్సీలకు అవాంతరాలుగా నిలిచాయి. లేదంటే ఇప్పటికే బిట్‌కాయిన్‌ విలువ 50 వేల మార్క్‌ను అందుకుని ఉండేదని నిపుణుల అంచనా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని