Bitcoin: రెండేళ్ల తర్వాత బిట్‌కాయిన్‌ @ 50,000 డాలర్లు

Bitcoin: ఈటీఎఫ్‌లకు ఆదరణ, స్టాక్‌ మార్కెట్‌లో ర్యాలీ, వడ్డీరేట్ల కోత అంచనాల నేపథ్యంలో బిట్‌కాయిన్‌ విలువ పుంజకుంటోంది.

Published : 13 Feb 2024 12:40 IST

Bitcoin | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ రెండేళ్ల తర్వాత తొలిసారి 50,000 డాలర్ల మార్క్‌ను తాకింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కాయిన్‌ విలువ 16.5 శాతానికి పైగా పుంజుకుంది. సోమవారం 50,334 డాలర్ల వద్ద గరిష్ఠానికి చేరింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:20 గంటల సమయంలో కాయిన్‌ 49,936 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇటీవల అమెరికాలో బిట్‌కాయిన్‌ స్పాట్‌ ఈటీఎఫ్‌లకు (Bitcoin ETF) అక్కడి సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్‌ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న బిట్‌కాయిన్‌ (Bitcoin) సరఫరాలో దాదాపు ఐదు శాతం ఈటీఎఫ్‌ల రూపంలో ఉన్నట్లు పోంప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వ్యవస్థాపకుడు ఆంటోనీ పోంప్లియానో వెల్లడించారు. ప్రారంభమైన 30 రోజుల్లో ఈ స్థాయి ఆదరణ రావడం విశేషమన్నారు.

మరోవైపు యూఎస్‌ కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోతపై త్వరలో తమ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే కారణంతో అక్కడి స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ర్యాలీ అవుతున్నాయి. శుక్రవారం ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ తొలిసారి 5,000 మైలురాయిని తాకింది. ఈ అంశాలు కూడా కాయిన్‌ పుంజుకోవడానికి దోహదం చేస్తున్నాయి.

వడ్డీరేట్ల కోతపై ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అయినప్పటికీ.. ఈ ఏడాది రేట్లను తగ్గించక తప్పదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై వచ్చే ఫెడ్‌ సమావేశంలో ప్రకటన ఉండొచ్చని ఆశిస్తున్నాయి.

(గమనిక: క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న వ్యవహారం. వీటిలో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. పై వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని