Bitcoin: క్రిప్టోలో మళ్లీ ర్యాలీ.. 35,000 డాలర్ల మార్క్‌ను అందుకున్న బిట్‌కాయిన్‌!

Bitcoin: త్వరలో బిట్‌కాయిన్‌ ఆధారిత ఈటీఎఫ్‌ రానుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలో తాజాగా ర్యాలీ మొదలైంది.

Published : 24 Oct 2023 15:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిట్‌కాయిన్‌ సహా ఇతర క్రిప్టోకరెన్సీల్లో సోమవారం భారీ ర్యాలీ కనిపించింది. బిట్‌కాయిన్‌ ఓ దశలో 35,000 డాలర్ల మార్క్‌ను దాటింది. 2022 మే తర్వాత ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. ఆదివారం నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చిన బిట్‌కాయిన్‌ ఇప్పటి వరకు దాదాపు 12 శాతం పెరిగింది. 34 వేల డాలర్ల కీలక మైలురాయిని అందుకున్న రెండు గంటల్లోనే 35 వేల మార్క్‌నూ దాటేయడం గమనార్హం.

బిట్‌కాయిన్‌ ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌కు అమెరికా నియంత్రణా సంస్థలు అమోదం తెలిపే అవకాశం ఉందనే అంచనాలే తాజా క్రిప్టో ర్యాలీకి కారణం. యూఎస్‌కు చెందిన బ్లాక్‌రాక్‌ అనే సంస్థ బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి అనుమతి లభించడం ఖాయమని ప్రముఖ విశ్లేషకుడు స్కాట్‌ జాన్సన్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా సంకేతాలిచ్చారు. అందుకు కావాల్సిన లైసెన్స్‌ లభించనట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. త్వరలోనే బిట్‌కాయిన్‌ ఆధారిత ఈటీఎఫ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బిట్‌కాయిన్ సహా ఇథేరియం వంటి ఇతర క్రిప్టోకరెన్సీలన్నీ ర్యాలీ అయ్యాయి.

గత 24 గంటల్లో బిట్‌ కాయిన్‌ 12.46 శాతం పెరిగి 34,344 డాలర్లకు చేరింది. మరోవైపు ఇథేరియం 9 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 4 శాతం, సొలానా 7 శాతం పెరిగాయి. క్రిప్టోలో నేరుగా ట్రేడ్‌ చేయడానికి వెనుకాడేవారికి ఈటీఎఫ్‌ ఓ మంచి మార్గమని నిపుణులు సూచించారు. స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ఈ ఈటీఎఫ్‌ను కొనుగోలు చేసే వీలుంటుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని