Boeing CEO: వైదొలిగిన బోయింగ్‌ సీఈఓ.. ఆ ప్రమాదమే కారణమా?

Boeing CEO: బోయింగ్‌ విమానయాన సంస్థ సీఈఓ డేవ్‌ డేవ్ కాల్హౌన్ పదవి నుంచి వైదొలిగారు. ఇటీవల పరిణామాలు ఆయన రాజీనామాకు దారి తీసినట్లు తెలుస్తోంది.

Updated : 25 Mar 2024 19:58 IST

Boeing CEO | వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ సీఈఓ డేవ్ కాల్హౌన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు  ప్రకటించారు. ఈ ఏడాది చివరికి ఆయన తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఆ కంపెనీకి చెందిన 737 మ్యాక్స్‌ విమానం డోర్‌ ఊడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కంపెనీ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. బోయింగ్‌ సీఈఓతో పాటు కమర్షియల్‌ విమానాల విభాగం ప్రెసిడెంట్‌, సీఈఓ స్టాన్‌ డీల్‌ త్వరలో రిటైర్‌ కానున్నారని కంపెనీ ప్రకటించింది. ఆయన స్థానంలో స్టెఫానీ పోప్‌ బాధ్యతలు చేపడతారని పేర్కొంది. అలాగే బోర్డు ఛైర్మన్‌గా స్టీవ్‌ మోలెన్‌కోఫ్‌ వ్యవహరిస్తారని తెలిపింది.

ఆ ప్రమాదమే కారణమా?

బోయింగ్‌ విమాన సంస్థలకు 737 మ్యాక్స్‌ విమానాలు మచ్చ తెచ్చిపెట్టాయి. గతంలో ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌-737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. ఈ ఏడాది జనవరి 5న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 16వేల అడుగుల ఎత్తులో ఉండగా డోర్‌ ఊడింది. ఈ ఘటనతో కంపెనీపై నియంత్రణ సంస్థల నిఘా మరింత ఎక్కువైంది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు తీవ్రతరం అవడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి. ఇటీవల అమెరికా విమాన సంస్థల సీఈఓల సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. కంపెనీపైనా, సీఈఓపైనా విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో డేవ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అసాధారణ పరిస్థితులు చుట్టుముట్టిన వేళ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలస్కా ప్రమాదాన్ని అందులో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని