Budget 2024: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అద్భుతమైన ప్రగతి.. బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌

Budget 2024: లోక్‌సభలో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌ 2024ను ప్రవేశపెట్టారు.

Updated : 01 Feb 2024 17:44 IST

దిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్‌ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) అన్నారు. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు. భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన ‘డెమోక్రసీ, డెమోగ్రఫీ, డైవర్సిటీ’ త్రయానికి దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే సత్తా ఉందన్నారు. గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ 2024ను (Union Budget 2024) ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

80 కోట్ల మందికి ఉచిత రేషన్‌..

‘‘గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వచ్చాయి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయి. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు.పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం. దాదాపు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

అభివృద్ధి చెందిన భారతే లక్ష్యం..

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో సామాజిక న్యాయం కేవలం రాజకీయ నినాదంగా మాత్రమే ఉండేది. కానీ, మేం దాన్ని అమలు చేసి చూపుతున్నాం. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపుతున్నాం. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించింది. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం.

భారీ ఎత్తున రుణసాయం..

పీఎం స్వానిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు ఇవ్వనున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2.7లక్షల కోట్లు ఆదా అయ్యింది. స్కిల్‌ ఇండియా మిషన్‌ కింద 1.4 కోట్ల యువకులకు నైపుణ్య శిక్షణ అందించాం. పీఎం ముద్ర యోజన కింద రూ.22.5 లక్షల కోట్లు విలువ చేసే 43 కోట్ల రుణాలను మంజూరు చేశాం.

ఏటా 11.8 కోట్ల రైతన్నలకు పీఎం కిసాన్‌..

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన ద్వారా ఏటా 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోంది. జాతీయ విద్యా విధానం ద్వారా అనేక మార్పులు తీసుకొచ్చాం. 3000 ఐటీఐలు, ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 15 ఎయిమ్స్‌లు, 390 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశాం. గత పదేళ్లలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది.

రాష్ట్రాలకు సహకారం అందిస్తాం.. 

భారత ఆర్థిక వ్యవస్థను సంఘటితపర్చడానికి డిజిటల్‌ ఇండియా చాలా కీలకం. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్‌ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడింది. మూలధన పెట్టుబడులకు ‘గిఫ్ట్‌ (GIFT)’ ఒక ప్రధాన మార్గంగా అవతరించింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. సామరస్యంతో కూడిన ప్రకృతి, ఆధునిక మౌలిక సదుపాయాలే వికసిత్‌ భారత్‌ విజన్‌. ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సాయం అందిస్తుంది. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలోని రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం’’ అని సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని