Budget 2024: ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్‌: పరిశ్రమ వర్గాలు

Union Budget 2024 బడ్జెట్‌ను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితంగా బడ్జెట్‌ను రూపొందించారని ప్రశంసించాయి.

Updated : 01 Feb 2024 20:34 IST

ముంబయి: ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడానికి ప్రతిసారి బడ్జెట్‌ సందర్భం కాదని పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ (Union Budget 2024)పై ఆయనతో పాటు వ్యాపార రంగ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాత్కాలిక బడ్జెట్‌ దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని తెలిపారు. 

శుభపరిణామం

‘‘చాలా ఏళ్లుగా గమనిస్తున్నా.. బడ్జెట్‌ అనగానే డ్రామా ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించే పాలసీ పరమైన నిర్ణయాలపై అంచనాలు పెంచేస్తాం. ఇంటి ఖర్చుల కోసం మనం లెక్కలు వేసుకున్నట్లే దేశానికి బడ్జెట్‌. మనకున్న ఆదాయవనరులతో ఎలా జీవించాలి? భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి? అనే అంశాలపై దృష్టిసారిస్తాం. ఎన్నికల ముందు ప్రకటించే ప్రజాకర్షక పథకాలేవీ ఈ బడ్జెట్‌లో లేవు. పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. జీడీపీలో పన్నుల వాటా పెరగడం శుభపరిణామం’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. 

ఆర్థికాభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌

‘‘తాత్కాలిక బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి స్థిరమైన ఆర్థికాభివృద్ధికి సమగ్ర రోడ్‌ మ్యాప్‌ను అందించారు. 2047 నాటికి ఇది భారత్‌ను ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది. పరిశోధన, ఆవిష్కరణలు, గ్రీన్‌ టెక్నాలజీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక ఆధారిత డిజిటల్‌ పరివర్తనలకు కేంద్రం పెద్దపీట వేసింది’’ అని బయోకాన్‌ ఎండీ కిరణ్‌ మజుందార్‌ షా (Kiran Mazumdar Shaw) తెలిపారు. 

మౌలిక వసతుల కల్పన

‘‘అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సాధారణ ప్రయాణికులు, వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా రోడ్డు, రైలు, విమాన మార్గాలను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించింది. భారత దేశ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది’’ అని అల్‌స్టోమ్‌ ఇండియా ఎండీ ఓలీవర్‌ లోయిసన్‌ తెలిపారు. 

కీలక ముందడుగు

‘‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు విస్తరిస్తామని కేంద్రం ప్రకటన చేయడం కీలక ముందడుగు. ప్రతి జిల్లాలో ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పడం.. మారుమూల ప్రాంతాలకూ ఆరోగ్య సేవలను విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు నిదర్శనం’’ అని జీయిస్‌ గ్రూప్‌ ఇండియా సీఎఫ్‌వో ధావల్‌ రాడియా తెలిపారు. 

స్వాగతిస్తున్నాం..

‘‘దేశీయంగా పర్యటక రంగాన్ని ప్రోత్సహించాలనే దూరదృష్టితో ఐకానిక్‌ టూరిజం కేంద్రాలను అభివృద్ధి చేసుకునేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. దాంతోపాటు ఆధ్యాత్మిక పర్యటకానికి ప్రభుత్వం మద్దతుగా నిలవడం శుభపరిణామం’’ అని హోటల్‌ అండ్ రెస్టారెంట్ ఫెడరేషన్‌ అసోసియేషన్ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రదీప్‌ శెట్టి తెలిపారు. 

సినిమా పేర్లతో ప్రశంసలు

ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష గోయెంకా (Harsh Goenka) కేంద్ర బడ్జెట్‌పై వినూత్నంగా స్పందించారు. ‘‘బడ్జెట్‌ 2024.. మాంద్యం అనే ‘యానిమల్‌’ను మచ్చిక చేసుకునే ‘ఫైటర్‌’. పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ‘గదర్‌’. ఎవరూ ‘12త్‌ ఫెయిల్‌' (12Th Fail)’ కాకుండా చూసుకునే స్వేహపూర్వక భారతీయ ‘జవాన్‌’. యువతకు ఉపాధి, విద్య, సంక్షేమం వంటి వాటికి ప్రాధాన్యమిస్తూ ‘బహుదూర్‌’ పని చేశారు మన ‘సలార్‌’ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌’’ అని ట్వీట్ చేశారు. 

ఫార్మా రంగానికి నిరాశ

ఫార్మా రంగానికి ఈ బడ్జెట్‌ నిరాశ కలిగించిందని అకుమ్స్ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మా ఎండీ సందీప్‌ జైన్‌ అన్నారు. మేకిన్‌ ఇండియా, గ్రీన్‌ ఎనర్జీ, యువతకు ఉపాధి వంటి ఎన్నో అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇచ్చారని, ఫార్మా రంగానికి ఎలాంటి మద్దతు లభించలేదని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో అయినా ఫార్మా రంగానికి మరిన్ని ప్రోత్సాహకాలు లభిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని