INDIGO: ఇండిగోలో బిజినెస్‌ క్లాస్‌

తన విమానాల్లో బిజినెస్‌ విభాగ సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్లు, దేశీయ విమానయాన అగ్రగామి సంస్థ ఇండిగో ప్రకటించింది.

Published : 24 May 2024 03:00 IST

ఈ ఏడాదిలోనే మొదలు

దిల్లీ: తన విమానాల్లో బిజినెస్‌ విభాగ సేవలను ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్లు, దేశీయ విమానయాన అగ్రగామి సంస్థ ఇండిగో ప్రకటించింది. దాదాపు 18 ఏళ్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, దేశ ఆర్థిక వృద్ధి రాణిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకుంది. కంపెనీ 18వ వార్షికోత్సవం ఆగస్టులో జరగనుండగా.. ఆ సమయంలోనే ‘టెయిలర్‌ మేడ్‌ బిజినెస్‌ ప్రోడక్ట్‌’ గురించి పూర్తి వివరాలు వెల్లడించనుంది. 30 పెద్ద (వైడ్‌ బాడీ) విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న నెలలోపే, ఇండిగో నుంచి తాజా ప్రకటన వెలువడడం గమనార్హం. ‘దేశీయ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణాన్ని పునర్నిర్వచించడం కోసం తాజా అడుగు వేస్తున్నామ’ని ఇండిగో పేర్కొంది. ‘రద్దీ ఎక్కువగా ఉండే, వ్యాపార మార్గాల్లో బిజినెస్‌ క్లాస్‌ను తీసుకురానున్నాం. ఈ ఏడాది చివరిలోపే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయ’ని సంస్థ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో విమానాల్లో ఎకానమీ సీట్లు మాత్రమే ఉన్నాయి. రోజుకు 2,000 విమాన సర్వీసులను నడుపుతున్న ఈ కంపెనీ వద్ద మొత్తం 360 విమానాలున్నాయి. 

లాభాలు రెట్టింపు: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఇండిగో నికర లాభం రూ.1894.8 కోట్లుగా నమోదైంది. 2022-23 ఇదే కాల లాభం రూ.919.2 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు కంటే అధికం. రద్దీ పెరగడం, సామర్థ్యం రాణించడం తదితర సానుకూలతలు ఇందుకు నేపథ్యం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.18505.1 కోట్ల ఆదాయంపై రూ.8172.5 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 2022-23లో ఆదాయం రూ.14600.1 కోట్లు, నికర నష్టం రూ.305.8 కోట్లుగా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు