‘మా అమ్మే నాపై దాడి చేయించింది’: రూ.11వేల కోట్ల సామ్రాజ్యంలో వారసత్వ పోరు

ఒక ప్రముఖ సంస్థలో ఆస్తి వివాదం ముదిరిపోయింది.  తన తల్లి తనపై దాడి చేయించారని ఓ బిజినెస్‌మ్యాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Published : 01 Jun 2024 18:34 IST

దిల్లీ: రూ.11వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో వారసత్వ పోరు మరింత ముదిరి, రచ్చకెక్కింది. తల్లే తనపై దాడి చేయించిందని ఓ బిలియనీర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ పొగాకు ఉత్పత్తుల సంస్థ గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ (Godfrey Phillips) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్‌ మోదీ (Samir Modi) పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

బోర్డ్‌ మీటింగ్ కోసం దిల్లీలోని సంస్థకు చెందిన జసోలా కార్యాలయానికి వచ్చిన తనపై దాడి జరిగిందని సమీర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లి(బీనా మోదీ) వ్యక్తిగత భద్రతాధికారి(PSO), పలువురు డైరెక్టర్లు తాను గాయపడేందుకు కారణమయ్యారని పేర్కొన్నారు. దీనికి తల్లే కుట్ర పన్నారని ఆరోపించారు. ‘‘నేను బోర్డు మీటింగ్‌ కోసం వెళ్తుంటే.. నన్ను బీనా మోదీ పీఎస్‌ఓ అడ్డుకున్నారు. నేను వెళ్లాలని పట్టుబట్టేసరికి.. నన్ను తోసేందుకు యత్నించారు. నాకు అనుమతి లేదని చెప్పారు. ఈ ఘర్షణలో నా చేతి వేలికి గాయమైంది. నా సొంత కార్యాలయంలో నాకు ఇలా జరుగుతుందని ఎన్నడూ అనుకోలేదు. నన్ను బోర్డు నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను వాటిని జరగనివ్వను’’ అని ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ సమీర్ వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అసంబద్ధమని గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ తోసిపుచ్చింది. సీసీటీవీ కెమెరాలు అన్నింటిని స్పష్టం చేస్తాయని వెల్లడించింది.

గాడ్‌ఫ్రే ఫిలిప్స్ యజమాని కేకే మోదీ 2019లో మరణించిన దగ్గరినుంచి ఆ కుటుంబంలో ఆస్తివివాదం నడుస్తోంది. తన తండ్రి ట్రస్ట్‌ డీడ్‌లో పేర్కొన్నట్టుగా తల్లి నిధులు పంపిణీ చేయడం లేదని సమీర్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో నలుగుతుండటంతో.. తన వాటాను విక్రయించే ప్రసక్తే లేదని వెల్లడించారు. కేకే మోదీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒకరు సమీర్ కాగా, ఇంకొకరు లలిత్‌ మోదీ. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) రూపకర్తగా లలిత్‌ పేరు పొందారు. అయితే తర్వాతకాలంలో పలు కేసుల్లో ఆయనపై ఆరోపణలు రావడంతో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని