బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా.. రవీంద్రన్‌కు బాధ్యతలు

Byjus: బైజూస్‌ ఇండియా సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నారు.

Updated : 15 Apr 2024 11:54 IST

బెంగళూరు: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో (Byjus) సంక్షోభం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ సోమవారం రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ (Byju Raveendran) పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రవీంద్రన్‌ క్యాట్‌ కోచింగ్‌ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్‌ ఆయనకు స్టూడెంట్‌ కావడం విశేషం. ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలే అవుతోంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరుణంలో రాజీనామా చేయడం గమనార్హం. కానీ, సంస్థకు సలహాదారుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సమాచారం. రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్‌ మోహన్‌కు సంస్థలో పేరుంది.

అర్జున్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాతే బైజూస్‌లో (Byjus) కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. మిగిలిన వారిని ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించారు. దేశవ్యాప్తంగా ఆఫీసులన్నింటినీ మూసివేశారు. అనుబంధ సంస్థ ఆకాశ్‌ కార్యకలాపాలను సైతం ఆయనే దగ్గరగా పర్యవేక్షించారు. తొలుత కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన మధ్యలో రెండేళ్లపాటు అప్‌గ్రాడ్‌ ఇండియా సీఈఓగా వెళ్లారు. సెప్టెంబరులో తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

తాజాగా అర్జున్‌ నిష్క్రమణతో బైజూస్‌ (Byjus) ఇండియా కార్యకలాపాలను యాప్‌ అండ్‌ ఏఐ, టెస్ట్‌ ప్రిపరేషన్‌, ట్యూషన్‌ సెంటర్లు.. ఇలా మూడు విభాగాలుగా రవీంద్రన్‌ వర్గీకరించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవలే ట్యూషన్‌ సెంటర్ల సంఖ్యను కూడా 250కి కుదించారు. తీవ్ర రుణ ఊబిలో చిక్కుకున్న కంపెనీ చివరకు ఉద్యోగుల వేతనాలను సైతం సకాలంలో చెల్లించలేకపోతున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని