Byjus EGM: బైజూస్‌ రవీంద్రన్‌ తొలగింపునకు ఈజీఎంలో తీర్మానం

Byjus EGM: ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ సీఈఓ పదవి నుంచి రవీంద్రన్‌ను తప్పించాలని ఇన్వెస్టర్లు నిర్ణయించారు. కోర్టు స్టే కారణంగా మార్చి 13 వరకు ఈ నిర్ణయాలు అమల్లోకి రావు.

Published : 23 Feb 2024 20:41 IST

Byjus | దిల్లీ: అనుకున్నదే జరిగింది. బైజూస్‌ రవీంద్రన్‌ (Byju’s Raveendran) వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఇన్వెస్టర్లు.. అతడిని సీఈఓగా తొలగించేందుకు నిర్ణయించారు. శుక్రవారం నిర్వహించిన అసాధారణ సమావేశంలో (EGM) మెజారిటీ వాటాదారులు రవీంద్రన్‌ను, బోర్డులో సభ్యులుగా ఉన్న ఆయన కుటుంబసభ్యులను తొలగించేందుకు తీర్మానించారు. అయితే, వ్యవస్థాపకులు హాజరుకాకుండా జరిగిన ఓటింగ్‌ చెల్లుబాటు కాదని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.

బైజూస్‌లో ఆర్థిక అవతకవకలు, పాలనాపరమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘనపై గళమెత్తుతూ ఎడ్‌టెక్‌ సంస్థలో ఇన్వెస్టర్లుగా ఉన్న ప్రోసస్‌, పీక్‌ ఎక్స్‌వీ, సోఫినా, లైట్‌స్పీడ్‌, జనరల్‌ అట్లాంటిక్‌, ఛాన్‌ జుకర్‌బర్గ్‌ ఇనీషియేటివ్‌ వంటి సంస్థలు ఈజీఎంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి రవీంద్రన్‌తో పాటు, అతని కుటుంబసభ్యులు గైర్హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సీఈఓ రవీంద్రన్‌ను తొలగించడంతో పాటు, కొత్త బోర్డు ఏర్పాటుకు అనుకూలంగా 60 శాతం మంది ఇన్వెస్టర్లు తీర్మానం చేసినట్లు ప్రోసస్‌ సంస్థ వెల్లడించింది.

ఈజీఎం తీర్మానంపై రవీంద్రన్‌, ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. వ్యవస్థాపకులు లేకుండా ఈజీఎంలో తీసుకున్న నిర్ణయాలేవీ విధానపరంగా చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. మరోవైపు ఈజీఎంలో వాటాదారులు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. మార్చి 13 వరకు అవి చెల్లుబాటు కావు. ఈజీఎంపై స్టే విధించాలంటూ బైజూస్‌ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందుకు తిరస్కరించిన ధర్మాసనం.. తదుపరి విచారణ వరకు నిర్ణయాలు అమలుకాకుండా స్టే విధించింది. రవీంద్రన్‌, ఆయన కుటుంబానికి ప్రస్తుతం 26.3 శాతం వాటా ఉంది. మరోవైపు ఇన్వెస్టర్లు బెంగళూరు ఎన్‌సీఎల్‌టీనీ కూడా ఆశ్రయించారు. సీఈఓ రవీంద్రన్‌ సహా ఇతర వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కొత్త బోర్డు ఏర్పాటుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు