dbrand: భారతీయుడి పేరుపై వెటకారం.. సారీ చెప్పి 10,000 డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ!

dbrand: ప్రోడక్ట్‌ సరిగా లేదంటూ ఫిర్యాదు చేసిన ఓ భారతీయుడి పేరును కెనడాకు చెందిన ఓ కంపెనీ ఎగతాళి చేసింది. సోషల్‌ మీడియాలో విమర్శలు రావటంతో క్షమాపణలు కోరింది. 

Updated : 11 Apr 2024 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైంది కెనడాకు చెందిన ఓ కంపెనీ. సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోయటంతో దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. కొంత సొమ్ము చెల్లించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే, ఇలా కస్టమర్లపై జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పడం గమనార్హం.

ఇటీవల భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు. రెండు నెలలు తిరగకముందే అది రంగు వెలిసిపోవడం ప్రారంభించింది. ఇదే విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ఫిర్యాదు చేస్తూ కంపెనీ అధికారిక ఖాతాకు ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ అతడి పేరులోని కొన్ని అక్షరాలను మార్చి విపరీతార్థం వచ్చేలా రాసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విదేశీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ బుద్ధి చెప్పారు. హద్దులు మీరుతున్నారని గుర్తు చేశారు. భారత్‌ వంటి అతిపెద్ద మార్కెట్‌ ఇకపై మీ వస్తువులను కొనుగోలు చేయకపోవచ్చునని హెచ్చరించారు. మీ ప్రతిష్ఠను దిగజార్చుకుంటారా? అని నిలదీశారు.

దీంతో డీబ్రాండ్‌ (dbrand) స్పందించింది. కస్టమర్‌ పేరును ఎగతాళి చేశామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తడబాటుగా చెబుతూ క్షమాపణలు కోరింది. గుడ్‌విల్‌ కింద 10,000 డాలర్లు ఆఫర్‌ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని దీన్ని ఆపబోమని చెప్పడం గమనార్హం. పైగా తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీరే కావొచ్చంటూ మళ్లీ తన బుద్ధిని బయటపెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని