McKinsey: కంపెనీని వీడితే 9 నెలల వేతనం.. ఉచిత కెరీర్‌ కోచింగ్‌: మెకిన్సీ

McKinsey: ఉద్యోగులను వదిలించుకునేందుకు సిద్ధమైన ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ మెకిన్సీ అండ్ కంపెనీ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీని వీడే వారికి 9 నెలల వేతనంతో పాటు కెరీర్‌ కోచింగ్‌ అందిస్తామని ప్రకటించింది.

Published : 02 Apr 2024 15:21 IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా వస్తున్న అత్యాధునిక మార్పులతో పాటు ఆర్థిక అనిశ్చితులే దీనికి కారణం. వడ్డీరేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితులు కంపెనీల కార్యకలాపాలను దెబ్బతీశాయి. దీంతో ఖర్చుల నియంత్రణలో భాగంగా సిబ్బంది సంఖ్యలో కోత పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ కన్సల్టెన్సీ సేవల సంస్థ ‘మెకిన్సీ అండ్ కంపెనీ’ (McKinsey & Company) సైతం బ్రిటన్‌లోని తమ కంపెనీ ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. అయితే, వారికి అందించే పరిహార ప్యాకేజీ, అనంతర మద్దతు విషయంలో ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు దెబ్బతినటంతో కన్సల్టెన్సీ సేవలకు గిరాకీ తగ్గింది. దీంతో మెకిన్సీ అండ్‌ కంపెనీకి (McKinsey & Company) ఆర్డర్లు సన్నగిల్లాయి. వ్యయ నియంత్రణ కోసం అన్ని కంపెనీల తరహాలోనే ఇది కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. గత ఏడాది 1,400 మందిని తొలగించింది. మరింతమందిని వదిలించుకోవాలనుకుంటున్న సంస్థ ఉద్యోగులకు ఆఫర్‌ ప్రకటించింది. వేరే కంపెనీల్లో అవకాశాలు వెతుక్కునే వారికి తొమ్మిది నెలల గడువు ఇచ్చింది. ఈ సమయంలో వారు ఆఫీసుకు వచ్చి పని చేయకుండానే పూర్తిస్థాయి వేతనం తీసుకోవచ్చని తెలిపింది. కంపెనీలోని కెరీర్‌ కోచింగ్‌ కోర్సులు సహా ఇతర వనరులను ఉచితంగా వాడుకోవచ్చని పేర్కొంది. వాటి ఆధారంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చని తెలిపింది. అయితే, గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం రాకపోయినా కంపెనీని వీడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.

గత ఏడాది 1,400 మందిని తొలగించిన మెకిన్సీ (McKinsey & Company) ఫిబ్రవరిలో దాదాపు 3,000 మందికి పనితీరును మెరుగుపర్చుకోవాలని నోటీసులు జారీ చేసింది. లేదంటే కంపెనీని వీడాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని