Patanjali: కరోనిల్‌ ప్రచారంపై పతంజలి ఆయుర్వేదను అప్పట్లోనే హెచ్చరించాం: కేంద్రం

Patanjali: ప్రజలను తప్పుదోవ పట్టించే పతంజలి ప్రకటనల కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కరోనిల్‌ ప్రచారంపై సంస్థను అప్పట్లోనే హెచ్చరించినట్లు వెల్లడించింది.

Updated : 10 Apr 2024 12:10 IST

దిల్లీ: అల్లోపతి ఔషధాల ప్రభావశీలతను తక్కువ చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) సంస్థ తీరును విమర్శిస్తూ కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. పతంజలి కోర్టు ధిక్కరణ కేసు నేడు విచారణకు రానున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఈ మేరకు స్పందన రావడం గమనార్హం. దేశంలో అందుబాటులో ఉన్న సమగ్ర వైద్యారోగ్య వ్యవస్థలో ఆయుష్‌ లేదా అల్లోపతి చికిత్సల్లో ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు ఉందని కేంద్రం తెలిపింది.

కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో ‘కరోనిల్‌’ను కరోనా వైరస్‌కు విరుగుడుగా ప్రచారం చేయడంపై పతంజలి (Patanjali Ayurved)ని హెచ్చరించినట్లు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఆయుష్‌ శాఖ నుంచి ఆమోదం లభించేవరకు అలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించినట్లు తెలిపింది. ఒక ఔషధాన్ని ఆమోదించే ముందు నిర్వహించాల్సిన క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రక్రియను గుర్తుచేసినట్లు వెల్లడించింది. అందుబాటులో ఉన్న వివిధ రకాల చికిత్సల ప్రాధాన్యాన్ని కేంద్రం నొక్కిచెప్పింది. దేన్నీ తులనాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పతంజలిపై వచ్చిన అభ్యంతరాలను వెంటనే పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకున్నామని తెలిపింది. ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న అన్ని చికిత్సల్లోని ప్రయోజనాలను ఉపయోగించుకుంటామని వివరించింది.

పతంజలి ఆయుర్వేద (Patanjali Ayurved) ఔషధాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు రాందేవ్‌, ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ బేషరతుగా సుప్రీంకోర్టుకు మంగళవారం క్షమాపణలు తెలిపారు. దీనికిగాను వారిద్దరూ విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేశారు. చట్టం, వాణిజ్య ప్రకటనలు, మార్కెట్‌ నిబంధనలను ఇకపై ఉల్లంఘించబోమంటూ సర్వోన్నత న్యాయస్థానానికి గత ఏడాది నవంబరు 21న పతంజలి తరఫున వీరు ప్రమాణ పత్రం సమర్పించారు. అయినప్పటికీ ఆ హామీలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం గత వారం వారిద్దరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్‌ బాబా, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ప్రమాణ పత్రం ఉల్లంఘనలపై చిత్తశుద్ధితో విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ఈ పొరపాటును పునరావృతం కానివ్వబోమని వాగ్దానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని